కూటమిలో ఓటమి భయం! | - | Sakshi
Sakshi News home page

కూటమిలో ఓటమి భయం!

Jun 16 2026 12:40 AM | Updated on Jun 16 2026 12:40 AM

సందిగ్ధంలో సం‘గ్రామం’

ఎన్నికల నిర్వహణపై తేలని పంచాయితీ

వచ్చే ఏడాది వరకు లేనట్టేనా?

అధికారుల పాలనపై

అసంతృప్తితో ప్రజలు

పిఠాపురం: ఇచ్చిన హామీలు నెరవేర్చక పోగా ప్రజలపై పన్నులు, పెట్రోల్‌, గ్యాస్‌ ధరల పెంపు వంటి మోయలేని భారాన్ని మోపిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లడానికి భయపడుతోందనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికే పూర్తి కావాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టత ఇవ్వలేక పోతోంది. ఇప్పటికే కొన్ని నెలలుగా అధికారుల పాలనతో ఉన్న గ్రామాల్లో అభివృద్ధి పనులు ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారుల పాలనపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. గ్రామ పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం పూర్తయ్యింది. ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రత్యేకాధికారుల పాలన జరుగుతోంది. గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితాలు సిద్ధం అయ్యాయి. ఇప్పటి వరకు ఓటర్ల జాబితాలు సిద్ధం కాక ఎన్నికలు ఆలస్యం అవుతున్నట్లు అనుకున్నారు. కాని ఓటర్ల జాబితా సిద్ధం అయినా ఎన్నికల నిర్వహణపై ఇప్పటికి ప్రకటన రాలేదు. దీంతో వచ్చే ఆరు నెలల్లో ఎన్నికలు జరుగుతాయని కలలు గన్న ఆశావహులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ప్రత్యేకాధికారుల పాలనపై ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్త మవుతోంది.

వెనుకాడుతున్న అధికార పక్షం

ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత నేపథ్యంలో షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించాల్సిన గ్రామ పంచాయతీల ఎన్నికలపై అధికార పార్టీల నేతలు ఉత్సాహం చూపించడం లేదనే వాదన వినిపిస్తోంది. ఇటీవల వైఎస్సార్‌ సీపీ నిర్వహించిన చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు తిరుగుబాటు కార్యక్రమం విజయవంతం కావడంతో ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ప్రత్యక్షంగా వెల్లడయ్యిందంటున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే ఓటమి తప్పదని భావించిన అధికార పక్షం వాయిదాకే మొగ్గు చూపుతోందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఎన్నికల కమిషన్‌ గత ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేసిన ప్రీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం గత ఏడాది అక్టోబర్‌ 15లోగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ, అక్టోబర్‌ 16 నుంచి నవంబర్‌ 15 లోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు, నవంబర్‌ 1 నుంచి 15 లోగా ఎన్నికల అధికారుల నియామకం, డిసెంబర్‌ 16 నుంచి 30లోగా పోలింగ్‌ కేంద్రాల ఖరారు, డిసెంబర్‌ 15 లోగా రిజర్వేషన్లు ఖరారు, జనవరిలో ఎన్నికల నిర్వహణ పూర్తి కావాల్సి ఉంది. కాని ఇప్పటికి ఓటర్ల జాబితా మాత్రమే పూర్తయ్యింది. కాని ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు విడుదల కాలేదు. ఈలోపు జరుగుతున్న జనాభా లెక్కలు, ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ కార్యక్రమాలను సాకుగా చూపిస్తు ఎన్నికలను వాయిదాలు వేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఇవన్నీ ఈ ఏడాది చివరి వరకు పూర్తి అయ్యే అవకాశం లేకపోవడంతో ఈ ఏడాది ఎన్నికలు జరిగే అవకాశం లేనట్టే కనిపిస్తోంది. వచ్చే ఏడాది అయినా ఎన్నికలు జరుగుతాయని నమ్మకం లేదు. ఎందుకంటే వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు రానుండడంతో అవి పూర్తయ్యే వరకు ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి పాలయితే అది సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపుతుందని అధికార పక్షం ఎన్నికలకు వెనుకాడుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఖరారు కాని రిజర్వేషన్లు

పంచాయతీలలో వార్డులు, గ్రామాల రిజర్వేషన్లు ఖరారు కావాల్సి ఉంది. ఈసారి తమకు అనుకూలంగా రిజర్వేషన్లు వస్తాయని కొందరు భావిస్తున్నారు. మరోవైపు ఆశావాహులు రిజర్వేషన్లను తమ వైపునకు మార్చుకునే ప్రయత్నాలలో ఉన్నారు. బీసీ రిజర్వేషన్ల వ్యవహారం కోర్టులో పెండింగ్‌లో ఉండగా దానిపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో ఎన్నికలపె ప్రభుత్వానికి ఆసక్తి లేదనేది అర్థమవుతోందంటున్నారు.

జిల్లా వివరాలు

గ్రామ పంచాయతీలు – 385

వార్డులు – 4,328

ఓటర్లు – 12,58,458

మహిళా ఓటర్లు – 6,34,864

పురుష ఓటర్లు – 6,23,547

ఇతరులు – 47 మంది

గ్రామాల్లో పడకేసిన పాలన

ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి అన్ని గ్రామాలలో ప్రత్యేక అధికారులు పాలన మొదలైంది. ఇప్పటికే వివిధ హోదాల్లో ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్న అధికారులు తమకు అదనంగా అప్పగించిన పంచాయతీల పాలనపై దృష్టి సారించలేని పరిస్థితి నెలకొంది. దీంతో అటు పాలక వర్గాలు లేక ఇటు ప్రత్యేకాధికారుల పాలనా సక్రమంగా లేక గ్రామాల్లో పాలన పడకేసింది. తమ అవసరాలు తీర్చడంలో అధికారులు విఫలమవుతున్నారని స్థానికులు వాపోతున్నారు. గ్రామాలలో తాగునీరు, పారిశుధ్యం సమస్యలు ప్రజలను ప్రధానంగా వేధిస్తున్నాయి. ప్రస్తుతం వేసవి నేపథ్యంలో పలు గ్రామాలలో తాగునీటి సమస్య పెరుగుతోంది. జల్‌ జీవన్‌ మిషన్‌ పనులు నిధుల కొరతతో నత్తనడకన సాగుతున్నాయి. దాంతో ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు పూర్తిస్థాయిలో ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తాగునీటి సమస్య అధికమైంది. పాలకవర్గాలు ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులను సరి చేసే వారు. ప్రస్తుతం ప్రత్యేక అధికారులు అందుబాటులో ఉండడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement