ధాన్యం డబ్బు ఇవ్వడం లేదని ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

ధాన్యం డబ్బు ఇవ్వడం లేదని ఫిర్యాదు

Jun 16 2026 12:40 AM | Updated on Jun 16 2026 12:40 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం విక్రయించి నెలలు గడిచినా రైస్‌మిల్లు యజమాని వాటికి సంబంధించిన డబ్బు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని పలువురు రైతులు వాపోయారు. తమకు వెంటనే డబ్బు ఇప్పించాలని కోరుతూ సోమవారం కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ హరేంధిరప్రసాద్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు పాట్నీడి అప్పారావు, పేకేటి గోవిందు, మద్దూరి వెంకన్నబాబు మాట్లాడుతూ పెదపూడి మండలం చింతపల్లిలోని రైస్‌మిల్‌ యజమాన్యం తమ వద్ద నుంచి 22,560 క్వింటాళ్ల బొండాలు రకం ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. వీటికి రూ. 5 కోట్లకుపైగా సొమ్ము చెల్లించాల్సి ఉందన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బు చెల్లించకుండా మిల్లు యజమాని ఇబ్బంది పెడుతున్నట్టు బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సంపర, వాకాడ, కాండ్రేగుల, కుమారప్రియం గ్రామాలకు చెందిన రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశారన్నారు. డబ్బు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తే బస్తా ధాన్యానికి రూ. 1,770 బదులు రూ.1,550 ఇస్తామంటూ బెదిరిస్తున్నట్లు చెప్పారు. మద్దతు ధర ఇప్పించాలని వారు డిమాండ్‌ చేశారు. రైతులకు మద్దతు ధర ఇప్పిస్తామని జిల్లా పౌరసరఫరాలశాఖ మేనేజర్‌ దేవుల నాయక్‌ హామీ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లో తొలి

స్ట్రీట్‌ ఫుడ్‌ హబ్‌గా కాకినాడ

కాకినాడ లీగల్‌: కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేపట్టిన స్ట్రీట్‌ ఫుడ్‌ హబ్‌ ప్రాజెక్టు అమలులో ఆంధ్రప్రదేశ్‌ నుంచి తొలి నగరంగా కాకినాడ ఎంపికై ంది. ఈ ఎంపికతో నగరానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించనుండగా, వీధి ఆహార విక్రేతలకు కొత్త అవకాశాలు, ప్రజలకు పరిశుభ్రమైన ఆహార సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కొన్ని పట్టణ స్థానిక సంస్థలతో కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్‌లో ఆ విషయాన్ని వెల్లడించారు. సమావేశంలో ఒడిశాలోని పూరి, హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలి, జమ్మూ–కాశ్మీర్‌లోని తాన్‌మార్గ్‌, రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారా, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌తో పాటు కాకినాడ నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. స్ట్రీట్‌ ఫుడ్‌ హబ్‌ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, అమలు విధానాలపై ప్రజెంటేషన్లు సమర్పించారు. సమావేశంలో మాట్లాడిన ఇన్‌చార్జి కమిషనర్‌ ఎన్‌వీవీ సత్యనారాయణ నగరంలో అనువైన ప్రదేశాన్ని గుర్తించి పరిశుభ్రమైన ఆహార విక్రయ కేంద్రాలు, తాగునీటి సదుపాయం, పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణ వ్యవస్థతో కూడిన ఆధునిక మౌలిక వసతులు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. పీఎం స్వనిధి పథకం లబ్ధిదారులకు ఈ ప్రాజెక్టు ద్వారా ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. అదనపు కమిషనర్‌ కే.టి.సుధాకర్‌, డీసీపీ కృష్ణారావు, పీపీఆర్వో శైలజ, స్మార్ట్‌ సిటీ ఇంజినీర్‌ మణికంఠేశ్వర, ఆర్కిటెక్ట్‌ రాజశేఖర్‌ పాల్గొన్నారు.

ఆత్మహత్య కేసులో

యువకుడిపై కేసు

కాకినాడ రూరల్‌: ప్రేమ పేరుతో మోసపోయి కాకినాడ రూరల్‌ స్వామినగర్‌లోని అద్దెంట్లో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి నర్సు వైరాల ప్రమీల (23) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో మృతురాలి అమ్మమ్మ దూలపల్లి ఆశ్వీరం ఫిర్యాదు మేరకు ఇంటి యజమాని కుమారుడు భరత్‌ నందన్‌పై ఇంద్రపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. తన మనమరాలిని మోసం చేసి, ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించినట్టు భరత్‌ నందన్‌పై కేసు నమోదు చేసిన ఎస్సై వీరబాబు దర్యాప్తు చేపడుతున్నారు. శనివారం రాత్రి ప్రమీల ఆత్మహత్యకు పాల్పడగా, జీజీహెచ్‌ మార్చరీలో మృతదేహం ఉంచడంతో బంధువులు ఆస్పత్రి వద్ద పడిగాపులు గాస్తున్నారు. ఇంద్రపాలెం పోలీస్‌ స్టేషన్‌ వద్ద మృతురాలి బంధువులు ఆదివారం ఆందోళన చేసిన సంగతి విదితమే. మంగళవారం పీఎం పూర్తయ్యాక కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement