● పీజీఆర్‌ఎస్‌లో అర్జీలు పెట్టినా
ఉపయోగం సున్నా
● గడువులోగా దేవుడెరుగు అసలు
సమస్యలు పరిష్కారమే కాని వైనం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): పీజీఆర్‌ఎస్‌లో ఇచ్చిన అర్జీలకు దిక్కూమొక్కూ ఉండడం లేదు. సమస్య చిన్నదైనా పరిష్కారం లభించడం లేదు. అటు మండల కేంద్రాల్లోనూ అర్జీలకు పరిష్కారం లభించకపోవడంతో దూరాభారమైనా జిల్లా కేంద్రానికి వచ్చి అర్జీలు సమర్పిస్తున్నారు. వాటికీ పరిష్కారం లభించడం లేదు. అర్జీలు ఇచ్చినప్పుడు పరిష్కారానికి ఇచ్చిన గడువు తేదీలోపు ఏ సమస్యా పరిష్కారం అవ్వడం లేదు. కొన్నిసార్లు మీ సమస్య పరిష్కారం అయ్యిందని సెల్‌ఫోన్‌కు మెసేజ్‌లు వస్తున్నాయి. కానీ వాస్తవంగా సమస్య మాత్రం అలాగే ఉంటోంది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ హరేంధిరప్రసాద్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
నా భూమి సర్వే చేయడం లేదు
నా భూమిని పక్కనే ఉన్న బంధువులు కొందరు ఆక్రమించుకొన్నారు. సర్వే చేసి ఆక్రమణకు పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అధికారులు చుట్టూ తిరుగుతున్నారు. రెండు సంవత్సరాలుగా ఇదే సమస్యపై పెద్దాపురం తహసీల్దార్ కార్యాలయానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు.
– ఉప్పిడి దొంగయ్య, రైతు, కట్టమూరు,
పెద్దాపురం మండలం
పింఛన్ ఇవ్వడం లేదు
నడవ లేని స్థితిలో ఉన్న నాకు పింఛన్ ఇవ్వకుండా అధికారులు పలుసార్లు తిప్పుకుంటున్నారు. గత ఏడాది కాలంగా పలుమార్లు అర్జీలు ఇచ్చినా నాకు పింఛన్ ఇవ్వడం లేదు. నేను నడిచే స్థితిలో లేను. ప్రతీ సారి ప్రత్యేకంగా ఆటోలో కాకినాడ రావాల్సి వస్తోంది. చాలా ఖర్చవుతోంది. అధికారులు స్పందించి పింఛన్ ఇవ్వాలి.
– గారపాటి పెద్ద అప్పన, చేబ్రోలు, గొల్లప్రోలు మండలం
విద్యుత్ సరఫరా
ఎప్పుడు ఇస్తారు?
నా ఇంటికి ఉన్న విద్యుత్ సరఫరా అధికారులు నిలిపివేశారు. ఇప్పటికి సంవత్సరం నుంచి విద్యుత్‌శాఖ అధికారులు చుట్టూ తిరుగుతున్నా. అయినప్పటికీ సమస్య పరిష్కారం కావడం లేదు. గొల్లప్రోలు మండలంలో జరిగిన మండల గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా ఉపయోగం లేదు. కరెంటు సరఫరా లేకపోవడంతో మొత్తం కుటుంబ సభ్యులం ఇబ్బంది పడుతున్నాం.
– ఉలవల సుబ్బయ్య, చేబ్రోలు,
గొల్లప్రోలు మండలం


