కాకినాడ రూరల్: జిల్లాలోని తీర ప్రాంత మత్స్యకార గ్రామాలలో సందడి నెలకొంది. సముద్రంలో చేపల వేటకు సోమవారం నుంచి అనుమతించడంతో తెల్లవారు జాము నుంచి మత్స్యకారులు తమ బోట్లతో చేపల వేటకు వెళ్లారు. కొందరు అర్ధరాత్రి వెళ్లి ఉదయమే చేపలతో తిరిగి వచ్చారు. ఏప్రిల్ 15న చేపల వేట నిషేధం అమలు నుంచి 61 రోజుల పాటు ఇంటికి పరిమితమైన మత్స్యకారుల్లో ఉత్సాహం నెలకొంది. తమ వలలకు చేపలు చిక్కాలని గంగమ్మకు పూజలు చేసి వేటకు పయనమవుతున్నారు. కాకినాడ ఫిషింగ్ హార్బర్, కుంభాభిషేకం, ఉప్పాడ తదితర చోట్ల మత్స్యకారులు, మత్స్యకార మహిళలు, వ్యాపారులతో సందడి నెలకొంది.


