ఇదేం బాధరా బాబూ!:
సెల్‌ఫోన్‌లో యాప్ డౌన్‌లోడ్ గురించి
తెలియక ఇబ్బంది
పడుతున్న రైతు నూకరాజు
పిఠాపురం: చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత ఎరువుల కోసం రైతులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. బస్తా ఎరువు కోసం సొసైటీలు, రైతు సేవా కేంద్రాల (ఆర్‌ఎస్‌కే) వద్ద వారు రేయింబవళ్లు పడిగాపులు పడిన దృశ్యాలు ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. ఇన్ని ఇక్కట్లు పడినా అదునుకు ఎరువు దొరకక కన్నీరు పెట్టుకున్న రైతులెందరో! ప్రభుత్వ నిర్వాకంపై కడుపు మండిన రైతులు పలుచోట్ల రోడ్లెక్కి ఆందోళనలు సైతం చేశారు. ఈ నరకం చాలదన్నట్లు.. రాష్ట్ర ప్రభుత్వం ఏపీ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ సిస్టం–2.0 (ఏపీఏఐఎంఎస్) పేరుతో అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌లో రైతుల ధ్రువీకరణ జరిగితేనే ఎరువులు విక్రయించాలని హోల్‌సేల్, రిటైల్ డీలర్లకు, సహకార సొసైటీలకు ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ భూములన్నిటికీ ఎరువుల పంపిణీ జరుగుతుందని అంటూనే వాటి విక్రయాలకు యాప్‌లో పలు నిబంధనలు పొందుపరిచింది. దీంతో, ఎరువుల కోసం తమకు ప్రతిసారీ కష్టాలు తప్పడం లేదని రైతులు వాపోతున్నారు.
యాప్ ద్వారా ఇలా..
వరి, పత్తి, ఆయిల్‌పామ్, మామిడి, జీడిమామిడి, మల్బరీ తదితర పంటలకు ఈ యాప్ ద్వారానే ఎరువులు పంపిణీ చేస్తారు. దీని కోసం రైతులు దగ్గర్లోని ఉన్న ఆర్‌ఎస్‌కేలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకుని యూనిక్ నంబర్ పొందాలి. వారికి మాత్రమే ఆర్‌ఎస్‌కేలు, సొసైటీలు, ప్రైవేటు డీలర్ల వద్ద యాప్ ద్వారా ఎరువులు విక్రయిస్తారు. ఈ విధానాన్ని కాకినాడ, కృష్ణా జిల్లాల్లో ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా గురువారం నుంచి అమలు చేస్తోంది. ఎరువుల వృథా నియంత్రణ పేరుతో ప్రభుత్వం ఈ విధానం తీసుకొచ్చింది. రైతులు గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, తమ ఆధార్, పాస్ పుస్తకాల వివరాలు, తాజాగా జారీ చేసిన డిజిటల్ నంబరును, భూమి, అందులో వేసే పంట వివరాలు నమోదు చేసుకోవాలి. అనంతరం, ఆ రైతులు ఆ పంటకు ఏయే ఎరువులు ఎంత మోతాదులో వాడాలనేది యాప్ ద్వారా నిర్ణయించి, ఆ మేరకు మాత్రమే ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ఇప్పటికే ఈ యాప్‌పై జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వ్యవసాయ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించారు.
రైతుల్లో ఆందోళన
జిల్లావ్యాప్తంగా సుమారు 3 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌లో అన్ని రకాల ఎరువులూ కలిపి సుమారు 66 వేల మెట్రిక్ టన్నులు అవసరమని అంచనా. ఇందులో ఒక్క యూరియానే 35,576 మెట్రిక్ టన్నులు అవసరమని అధికారులు చెబుతున్నారు. ఈ సీజన్‌లో యాప్ ద్వారానే ఎరువులు విక్రయించాలనే విధానాన్ని ప్రభుత్వం తీసుకుని రావడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ విధానం ప్రకారం ప్రతి రైతు తప్పనిసరిగా ఆండ్రాయిడ్ ఫోన్ కలిగి ఉండాలి. దాని వాడకం తెలిసి ఉండాలి. నెట్ బ్యాలన్స్ కలిగి, వెబ్‌ల్యాండ్‌లో నమోదై ఉండాలి. అయితే, జిల్లావ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్లు లేని రైతులే అధికం. ఎక్కువ శాతం మంది కౌలు రైతులే వ్యవసాయం చేస్తున్నారు. వీరికి కౌలు కార్డులు ఇవ్వడానికే రైతులు అభ్యంతరాలు చెప్పిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అటువంటిది ఇప్పుడు ఏకంగా ఆ కౌలు రైతు పేరున యాప్‌లో వివరాలు నమోదు చేస్తే.. అసలు రైతులు ఊరుకుంటారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతే కాదు.. చాలా గ్రామాల్లో ఇంటర్నెట్ సిగ్నల్ సమస్య అధికంగా ఉంటుంది. ఎరువులు కావాల్సిన సమయంలో ఆన్‌లైన్ ఇబ్బందులు వస్తే.. గంటల తరబడి దుకాణాల వద్ద పడిగాపులు పడాల్సి వస్తుందని రైతులు అంటున్నారు. అలాగే, తమకు కేటాయించిన దుకాణాలకు సరైన సమయంలో స్టాకు వస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. ఎరువులు, పురుగు మందులు కొనడానికే అప్పులు చేస్తూంటే ఇక స్మార్ట్‌ఫోన్లు కూడా ఎక్కడ కొనగలుగుతామని అంటున్నారు.
అసంపూర్తిగా మ్యాపింగ్
మరోవైపు యాప్‌తో రైతుల అనుసంధాన ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. కానీ, ఇప్పటికీ చాలామంది రైతులు యాప్‌తో మ్యాపింగ్ కాలేదు. వారికి గత ఏడాది ఈ–క్రాప్ నమోదు ఆధారంగా ఎరువులు ఇస్తామని ప్రభు త్వం చెబుతోంది. దీని ప్రకారం ఇటు యాప్‌లో మ్యాపింగ్ జరగక, అటు గత ఏడాది ఈ–ప్ నమోదు కాని రైతులకు ఎరువులు లభించే అవకాశం లేదన్నది స్పష్టమవుతోంది. పైగా ఈ–క్రాప్ కూడా పొలం యజమానుల పేరిట జరిగింది. ఇక కౌలు రైతుల్లో చాలా మందికి కౌలు గుర్తింపు కార్డులే ఇవ్వలేదు. ఇప్పుడు వారి యాప్ మ్యాపింగ్ కూడా భూమి యజమానుల పేరిటే జరుగుతోంది. ఫలితంగా ఎరువులు బుక్ చేస్తే ఓటీపీ భూ యజమానులకే వెళ్తుంది. మరోవైపు సర్వర్ సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. వీటన్నింటికీ తోడు రీ సర్వే, జాయింట్ ఎల్‌పీ నంబర్లతో అనేక సమస్యలుండగా యాప్ ద్వారా ఎరువుల పంపిణీ ఎలా సాధ్యమవుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. యూరియా, డీఏపీ ఎరువుల వాడకాన్ని నియంత్రించడానికే యాప్‌ను అందుబాటులోకి తెచ్చామని ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఎరువుల సబ్సిడీలను తగ్గించే ఎత్తుగడ ఈ యాప్ విధానం వెనుక ఉందని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గత ఖరీఫ్ కంటే ఎరువుల వాడకం తగ్గి తీరాలని ఇప్పటికే వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.
యాతన తప్పదు
ఈ–క్రాప్ నమోదు ప్రకారం పంటల వివరాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. ఒకసారి ఎంటర్ చేస్తే అదే పంట పండించాలి తప్ప సీజనల్‌గా పంట మార్చుకునే అవకాశం ఉండదు. ఏ షాపులున్నాయనేది తెలియని పరిస్థితి. మూడు రోజులు ముందుగా ఎరువులు బుక్ చేసుకోవాలి. తీరా మూడో రోజు ఎరువుల స్టాకు అందుబాటులో ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. ఈ యాప్‌పై రైతులకు ఎటువంటి అవగాహనా లేదు. గత రెండు సీజన్లలో ఎరువుల కోసం రైతులు యుద్ధాలు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు వ్యవసాయంపై విరక్తి కలిగే పరిస్థితులు వస్తాయి.
– ఉలవకాయల నాగ లోవరాజు,
జెడ్పీటీసీ సభ్యుడు, గొల్లప్రోలు
యాప్ ద్వారా ఎరువుల పంపిణీ
జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం
రైతులకు మ్యాపింగ్ సమస్య
కౌలు రైతులకు ఓటీపీ కష్టాలు
సాంకేతిక ఇబ్బందులు
తప్పవని ఆందోళన


