● ఆ అర్హత కూటమి ప్రభుత్వానికి లేదు
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
దాడిశెట్టి రాజా
కోటనందూరు: అన్ని వర్గాల ప్రజలకూ వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ప్రభుత్వానికి విజయోత్సవ సభలు నిర్వహించే అర్హత లేదని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై కోటనందూరు మండలం ఇండుగపల్లిలో పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఆదివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో మొదటిదైన ఆడబిడ్డ నిధి పథకాన్ని చంద్రబాబు ఎగ్గొట్టారని అన్నారు. రెండో పథకమైన రూ.3 వేల నిరుద్యోగ భృతి, మూడో పథకం 50 ఏళ్లకే పెన్షన్ సైతం అమలు చేయలేదని, అయినప్పటికీ రెండేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని చంద్రబాబు తెలుగు తమ్ముళ్లకు చెప్పడం విడ్డూరంగా ఉందని రాజా దుయ్యబట్టారు. రాజధాని నిర్మాణంలో కూటమి నాయకులు భారీ కుంభకోణానికి తెర లేపారని అన్నారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, నిరుద్యోగులు.. ఇలా అన్ని వర్గాలనూ మోసం చేసి ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. కూటమి పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వంలో ఫ్యామిలీ డాక్టర్ ఇంటింటికీ వెళ్లి, వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు అందజేస్తే.. ప్రస్తుత కూటమి పాలనలో ప్రభుత్వాస్పత్రులకు వెళ్లినా పేదలకు వైద్యం అందడం లేదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలను మోసం చేయడం తప్ప చేసిందేమి లేదని దుయ్యబట్టారు.
ఓట్లు తొలగించే ప్రమాదం
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – సర్ పేరుతో నిర్వహించే సర్వేలో ఓట్లు తొలగించే ప్రమాదముందని, దీనిపై పార్టీ నాయకులు, బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్‌ఏ) అప్రమత్తంగా ఉండాలని రాజా అన్నారు. సర్వే ప్రతినిధుల వెంట వైఎస్సార్ సీపీ బీఎల్‌ఏలు విధిగా ఉండాలని, అర్హులైన ఏ ఒక్కరి ఓటూ తొలగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఒకసారి ఓటు తొలగిస్తే తిరిగి వచ్చే అవకాశం ఉండదని, అందువలన అత్యంత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అర్హులైన యువతీ, యువకులను ఓటర్లుగా చేర్పించాలన్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ నాయకులు సమావేశాలు నిర్వహించి, ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.
విజయమే లక్ష్యం కావాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని రాజా దిశానిర్దేశం చేశారు. నాయకులు, కార్యకర్తలు పక్కా ప్రణాళికతో సైనికుల్లా పని చేసి, విజయం సాధించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ లగుడు శ్రీనివాస్, నాయకులు గొర్లి రామచంద్రరావు, నల్లమిల్లి గోవిందు, లంక ప్రసాద్, మేముల రాజబాబు తదితరులు పాల్గొన్నారు.
అయినవిల్లి.. భక్తులతో శోభిల్లి
అయినవిల్లి: విఘ్నేశ్వరస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి ఒక జంట పంచామృతాభిషేకం చేసింది. 23 మంది లఘున్యాస అభిషేకాలు, ఏడుగురు లక్ష్మీగణపతి హోమం, ఒక చిన్నారికి అక్షరాభ్యాసం, 11 మంది భక్తులు తమ నూతన వాహనాలకు పూజలు చేశారు. 1,706 మంది స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయానికి రూ.1,75,313 సమకూరింది.


