● పెదమల్లాపురం కేంద్రంగా మండలం లేదా ఐటీడీఏ సాధనకు పోరుబాట
● 1980 నుంచీ నెరవేరని ఆకాంక్ష
● మళ్లీ గళమెత్తుతున్న గిరిజనం
ప్రత్తిపాడు రూరల్: ఒకే భౌగోళిక ప్రాంతం.. ఒకే విధమైన సంస్కృతి.. పరిపాలన మాత్రం నాలుగు ముక్కలు! ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల పరిధిలోని 59 ఏజెన్సీ గ్రామాల ప్రజలు నాలుగు వేర్వేరు మండలాల చుట్టూ తిరగలేక, సరైన అభివృద్ధి అందక అల్లాడుతున్నారు. 90 శాతం గిరిజన జనాభా ఉన్న ఈ ప్రాంతాన్ని పెద్దమల్లాపురం కేంద్రంగా ప్రత్యేక మండలంగా తీర్చిదిద్దాలన్న డిమాండ్ ఇప్పుడు మళ్లీ గళమెత్తుతోంది. శంఖవరంలో (23 గ్రామాలు), రౌతులపూడి (16), ఏలేశ్వరం (15), కోటనందూరు (5) మండలాల్లోని మొత్తం 59 సబ్ ప్లాన్ ఏజెన్సీ గ్రామాలను కలిపి ప్రత్యేక మండలంగా ప్రకటించాలని స్థానిక గిరిజనులు ఎప్పటి నుంచో కోరుతున్నారు.
సుదీర్ఘ పోరాటం
ఈ 59 గ్రామాలకు పెద్దమల్లాపురం భౌగోళికంగా మధ్యలో ఉండటంతో పాటు కీలక గిరిజన గ్రామం కావడంతో దీనినే మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉంది. ఈ గ్రామాల పరిధిలో సుమారు 40 వేల మంది జనాభా ఉండగా, అందులో దాదాపు 90 శాతం అంటే 32 వేల మంది గిరిజనులే. ప్రత్యేక మండల డిమాండ్ 1980 నుంచీ ఉంది. అప్పట్లో ఐటీడీఏ వ్యవస్థలు బలపడుతున్న తరుణంలోనే ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేక మండలం ఉండాలని ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఈ గ్రామాలు నాలుగు వేర్వేరు మండలాల్లో ఉండటంతో సంక్షేమ పథకాల అమలు, పరిపాలనలో గందరగోళం ఏర్పడుతోంది. రవాణా, విద్య, వైద్య సమస్యల పరిష్కారం కోసం ఈ గ్రామాల వారు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ప్రత్యేక మండలం ఏర్పడితే పెద్దమల్లాపురంలో ిపీహెచ్‌సీ, పోలీసు స్టేషన్, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు అందుబాటులోకి వస్తాయి. గిరిజన ఉప ప్రణాళిక నిధులు పూర్తిస్థాయిలో ఈ ప్రాంతాలకే ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల స్థానిక గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
అనేక విజ్ఞాపనలు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు మండలాల పరిధిలోని 50 సబ్‌ప్లాన్ ఏజెన్సీ గ్రామాల గిరిజనులకు రంపచోడవరం ఐటీడీఏ కేంద్రంగా ఉండేది. అయినా గిరిజనులకు అందాల్సిన సదుపాయాలు వీరికి దక్కేవి కావు. ఈ క్రమంలో గిరిజన హక్కుల సాధన సంఘం, కొండరెడ్డి, కమ్మర, శృంగధార గిరిజన సంక్షేమ సంఘం, ఆదివాసి గిరిజన సంఘాలు కలిసి పెదమల్లాపురం మండల సాధన కమిటీగా ఆవిర్భవించాయి. ఎస్టీ కమిషన్ చైర్మన్‌కు అనేక సందర్భాల్లో విజ్ఞాపనలు అందజేశారు.
పవన్ కల్యాణ్ హామీ
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఏలేశ్వరం రోడ్‌లో జరిగిన సభలో పాల్గొన్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పెదమల్లాపురం గిరిజన మండలం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రిగా పదవినధిష్టించి 22 నెలలు దాటినా పట్టించుకోలేదని గిరిజనం మండిపడుతోంది.
ఇన్నేళ్లకు మళ్లీ..
ప్రభుత్వం జిల్లాలు, మండలాల పునర్విభజనకు సిద్ధమవుతుండటంతో తెరమరుగైన పెదమల్లాపురం కేంద్రంగా ఐటీడీఏ ప్రతిపాదన మళ్లీ పురుడు పోసుకుంటోంది. సబ్‌ప్లాన్ ఏరియా గిరిజనులు పెదమల్లాపురం కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కుల ధ్రువీకరణ పత్రాలకు దిక్కు లేదు
ఈ ప్రాంత గిరిజనులకు పెద్దాపురం ఆర్టీఓ ద్వారా ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాల్సి ఉంటుంది. పురుషులకు కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేస్తున్నా, మహిళలకు భర్త ఇంటి పేరున మంజూరు చేయడానికి అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. దీంతో ఉన్నత విద్యకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడి స్కాలర్ షిప్‌లకు దూరమవుతున్నారు.


