కాకినాడ రూరల్: కూటమి పాలనలో విశాఖలో విచిత్ర పరిస్థితి నెలకొందని, నగరంలో వాకింగ్ చేయాలంటే పన్ను కట్టాలా అని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి నిలదీశారు. విశాఖపట్నం కార్పొరేషన్ కమిషనర్ రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం నగర వాసులు, సామాన్యుల ఆరోగ్యంపై పడేలా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ నగరంలోని ప్రతి పార్కు, స్టేడియం వద్ద ప్రతీ వాకర్ రూ.750 చెల్లించాలని ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో జనం అవాక్కయ్యారని, బలవంతపు వసూళ్లకు పూనుకోవడమేమిటని ఆమె ప్రశ్నించారు. ఖరీదైన జిమ్‌లు, హెల్త్ క్లబ్బులకు వెళ్లలేని పేద మధ్య తరగతి ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కూడా సొమ్ము చెల్లించాల్సిన దుస్థితిని తీసుకురావడం సిగ్గు చేటు అన్నారు. విశాఖపట్నంలో అమలు చేయనున్న బలవంతపు వసూళ్లను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. దీనిని విశాఖ వాసులతో పాటు అందరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు.
మేధో సంపత్తి
హక్కులపై సదస్సు
బాలాజీచెరువు: పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మేధోసంపత్తి హక్కులపై జాతీయ స్థాయి సదస్సు కళాశాల మేనేజ్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ కందుల ఆంజనేయులు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా సీనియర్ న్యాయవాది ఎం.డీ.జవహర్ ఆలీ హాజరై మేధోసంపత్తి హక్కుల రక్షణలో ఉన్న సందేహాలు, వాటి ప్రాధాన్యం వివరించారు. ఏఐ కాలంలోనూ మేధోసంపత్తి హక్కుల రక్షణ సాధ్యమని, ప్రతి వ్యక్తి విలువలను పాటించి యాజమాన్య హక్కులను చెందవలసినవారికి ఇస్తే అది సాధ్యమని వివరించారు. చైన్నె పేటెంట్ ఆఫీసు నుంచి ఆన్‌లైన్‌లో హాజరైన సుబారాబెనర్జీ కాపీరైట్స్‌కు సంబంధించి అనేక అంశాలు వివరించారు. రిజిస్టర్ అయిన పేటెంట్ కాపీరైట్ ఎలా కాపాడుకోవాలో తెలిపారు. ప్రొఫెసర్ గంటా సత్యనారాయణ, కామర్స్ విభాగాధిపతి పాండు రంగారావు, వైస్ ప్రిన్సిపాల్ సంజీవ్‌కుమార్, కె.లక్ష్మణ్, ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్ పి.హరిరామప్రసాద్ పాల్గొన్నారు.
వసతి గృహాల్లో అడ్మిషన్లకు
దరఖాస్తుల ఆహ్వానం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ప్రభుత్వ బధిర బాలుర, బాలికల వసతి గృహంలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తునట్టు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ సహాయ సంచాలకులు ఏ వై. శ్రీనివాసు గురువారం ప్రకటనలో తెలిపారు. కాకినాడ సాంబమూర్తినగర్‌లో గల ప్రభుత్వ బధిరుల పాఠశాలలో నేరుగా అడ్మిషన్ పొంది, అదే ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ బధిర బాలుర వసతి గృహంలో అడ్మిషన్ పొందాలనుకొనేవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. వివరాలకు 0884 2352303 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
భగీరథుడి కృషి ఆదర్శనీయం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): సమాజ అభ్యున్నతి, సమాజ హితం కోసం పట్టుదల, సంకల్పబలంతో భగీరథుడు చేసిన తపస్సు, కృషి ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం భగీరథ మహర్షి జయంతిని నిర్వహించారు. కలెక్టర్ భగీరథుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భగీరథుడు గంగను భూమికి తీసుకువచ్చిన మహనీయుడిగా చరిత్రలో నిలిచారన్నారు. ప్రజల సంక్షేమం కోసం, అంకితభావంతో పనిచేయడం వంటి విలువలు భగీరథుని జీవితంలో మనకు స్పష్టంగా కనిపిస్తాయని కొనియాడారు. ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఏ.శ్యామల కుమారి, బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాసరావు పాల్గొన్నారు.


