సర్పవరం జంక్షన్‌ వద్ద ఉద్రిక్తత | - | Sakshi
Sakshi News home page

సర్పవరం జంక్షన్‌ వద్ద ఉద్రిక్తత

Apr 24 2026 7:20 AM | Updated on Apr 24 2026 7:20 AM

గుండె సంబంధిత వైద్యం కోసం వెళ్లిన

ఉపాధ్యాయుడి మృతి

ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి

చెందాడని కుటుంబ సభ్యుల ఆరోపణ

కాకినాడ రూరల్‌: జిల్లా సైన్స్‌ అధికారి, కాకినాడ రూరల్‌ తమ్మవరం గ్రామ పంచాయతీ పరిధిలోని పోలవరం యూపీ స్కూల్‌ ప్రధానోపాధ్యాయుడు మైలపల్లి శ్రీనివాస్‌ వినీల్‌ అకాల మృతి కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయ వర్గాలను తీవ్ర విషాదంలో నింపింది. ఆయన గుండె సంబంధిత సమస్యతో సర్పవరం జంక్షన్‌ వద్ద గల ప్రైవేట్‌ ఆస్పత్రిలో మంగళవారం చేరారు. బుధవారం శస్త్ర చికిత్స జరగగా రాత్రి మృతి చెందినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించడంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. వైద్యులు నిర్లక్ష్యం కారణంగానే తన భర్త మృతి చెందారని, ఇద్దరు చిన్న పిల్లలను వీధిన పడేశారని భార్య విలపించడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయ సంఘాల నేతలు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని, ఆస్పత్రిపై చర్య తీసుకోవాలని ఆందోళనకు దిగారు. మరోవైపు ఆస్పత్రిలోని వైద్యులకు మద్దతుగా ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ)సభ్యులు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆస్పత్రి ఎదురుగా ఉన్న వలసపాకల రోడ్డుపై ట్రాఫిక్‌ స్తంభించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆస్పత్రి వద్ద ఆందోళన జరగడంతో సర్పవరం పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆస్పత్రి వర్గాలు, మృతుడి కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయుల మధ్య చర్చలు అనంతరం రాత్రి ఆందోళన విరమించారు.

Advertisement
 
Advertisement
Advertisement