కోస్ట్‌గార్డు ‘విన్యాసం’ | - | Sakshi
Sakshi News home page

కోస్ట్‌గార్డు ‘విన్యాసం’

Apr 24 2026 7:20 AM | Updated on Apr 24 2026 7:20 AM

కాకినాడ క్రైం: కాకినాడ కోస్ట్‌గార్డు స్థానిక అధికారులు సొంత పెత్తనాలకు తెరలేపి శాఖ పరువును దిగజార్చుతున్నారు. గురువారం కాకినాడ శాఖ అధికారులు సాగర తీరంలో చాటుగా విన్యాసాలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఏటా సంప్రదాయంగా జరిగే ఈ విన్యాసాలకు ఈ ఏడాది ఉన్నతాధికారులు ఎవరూ రాకపోవడం చర్చకు దారితీసింది. ఎక్కడా ప్రచారం లేకుండా చాటుగా నిర్వహించాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం మీడియా సహా అనుబంధ విభాగాల సమక్షంలో కోస్ట్‌గార్డు విన్యాసాలు సముద్రంలో జరగాల్సి ఉంది. అయితే, ఎవరినీ ఆహ్వానించకుండానే, ఎంతోమంది తరలి వచ్చారని లెక్కల్లో చూపి అధిక బిల్లులు రాసుకోవడం కాకినాడ అధికారులకు పరిపాటిగా మారిందని కాకినాడ కోస్ట్‌గార్డు కార్యాలయానికి చెందిన ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. కాగా చాటుగా విన్యాసాలు ఎందుకు నిర్వహించారనే అంశంపై స్థానిక అధికారులను ఉన్నతాధికారులు వివరణ కోరడం చర్చనీయాంశమైంది.

అన్నవరంలో మాక్‌ డ్రిల్‌

అన్నవరం: విజయవాడకు చెందిన 80 మంది ఉగ్రవాద నిరోధక దళం (ఆక్టోపస్‌) పోలీసులు గురువారం రాత్రి తొమ్మిది గంటల నుంచి 10–30 గంటల వరకు రత్నగిరిపై సత్యదేవుని ఆలయ సమీపంలో ‘ఆగమ్‌’ పేరుతో మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. ఉగ్రవాదులు దేవస్థానంలో చొరబడితే వారిని ఎలా పట్టుకుంటారో ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. ఒక్కసారిగా 80 మంది పోలీసులు ఆలయం వద్దకు రావడంతో అందరూ కంగారు పడ్డారు. చివరకు ఇది మాక్‌ డ్రిల్‌ అని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఈ మాక్‌ డ్రిల్‌ నిర్వహించినట్టు ఆక్టోపస్‌ డీఎస్‌పీలు విశ్వనాఽఽథ్‌, తిమ్మయ్య తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement