నేడు కొలువు తీరనున్న ‘అన్నవరం’ ట్రస్ట్‌ బోర్డు | - | Sakshi
Sakshi News home page

నేడు కొలువు తీరనున్న ‘అన్నవరం’ ట్రస్ట్‌ బోర్డు

Apr 24 2026 7:20 AM | Updated on Apr 24 2026 7:20 AM

అన్నవరం: వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి (ట్రస్ట్‌ బోర్డు) శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనుంది. ఈ నేపథ్యంలో దేవస్థానంలోని రామాలయం వద్ద గల విశ్రాంతి మండపంలో ఏర్పాట్లు పూర్తిచేశారు. చైర్మన్‌ ఐవీ రోహిత్‌తో పాటు 16 మంది సభ్యులు, నలుగురు ఆహ్వానితులు, ఒక ఎక్స్‌ అఫీషియో సభ్యుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

అన్నదానంలో సత్యదేవుని ప్రసాదంపై

తొలి తీర్మానం

సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో సత్యదేవుని ప్రసాదం కూడా పెట్టాలంటూ భక్తులు కోరుతున్న నేపథ్యంలో దీనిపై ఈ నెల 12న ‘సాక్షి’లో ‘అమాత్యా.. మొరాలకించవా! ’ శీర్షికన వార్త ప్రచురితమైన విషయం తెలిసిందే. అదేరోజు అన్నవరం వచ్చిన దేవదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దీనిపై స్పందించి అన్నదానంలో స్వామివారి ప్రసాదం పెట్టాలని ఆదేశించారు. ట్రస్ట్‌ బోర్డు తొలి సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేయనున్నట్టు అధికారులు తెలిపారు.

పుష్కరాల ఏర్పాట్ల పైనా..

2027 జూన్‌లో జరుగనున్న గోదావరి పుష్కరాలకు రాజమహేంద్రవరం వచ్చే భక్తులు సత్యదేవుని కూడా దర్శించుకుంటారు. పుష్కరాల 12 రోజులూ ఈ విధంగా భక్తుల తాకిడి ఉంటుంది. ఈ నేపథ్యంలో చేపట్టవలసిన ఏర్పాట్లపై ట్రస్ట్‌బోర్డు తీర్మానించి కమిషనర్‌ అనుమతికి పంపించాల్సి ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement