లాభాలు వెదజెల్లీ | - | Sakshi
Sakshi News home page

లాభాలు వెదజెల్లీ

Apr 24 2026 5:56 AM | Updated on Apr 24 2026 5:56 AM

స్టాల్‌లో తాండ్రను విక్రయిస్తున్న మహిళ

చాపలపై మామిడి గుజ్జును పూస్తున్న మహిళలు

ఆత్రేయపురం: పూతరేకుల పేరు వినగానే అందరికీ వెంటనే ఆత్రేయపురం గుర్తుకు వస్తుంది. ఈ గ్రామంలో తయారయ్యే పూతరేకులు దేశ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందాయి. అయితే మామిడి తాండ్ర (మ్యాంగో జెల్లీ) తయారీకి కూడా ఆత్రేయపురం పేరు గాంచింది. శతాబ్దాలుగా ఇక్కడ తాండ్ర తయారీ పేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలకు ఉపాధిగా ఉంది. పూర్వం ఈ ప్రాంతంలో మామిడి తోటలు హెచ్చుగా ఉండటం వల్ల పండ్లను నిల్వ చేసుకోవటానికి ఇదొక ప్రధాన మార్గంగా భావించి అప్పట్లో తాండ్ర తయారీ చేయడం ప్రారంభించారని పూర్వీకులు చెబుతారు. ప్రస్తుతం ఇక్కడి మామిడి తాండ్ర దేశ, విదేశాలకు ఎగుమతి అవుతోంది. ప్రధానంగా కలెక్టర్‌ రకం మామిడి పండ్లతో తాండ్ర తయారు చేస్తుంటారు.

యంత్రాల వినియోగం

ప్రస్తుతం తాండ్ర తయారీకి రసం తీసే చిన్నపాటి యంత్రాలను వినియోగిస్తున్నారు. రసం తీసిన తర్వాత పంచదార, బెల్లం కలిపి ఈత ఆకు చాపలపై రసం పోసి ఆరబెడతారు. ఇలా వారం, పది రోజుల పాటు దళసరి సరిపడినంత వచ్చిన తర్వాత వాటిని చాపపై కోసి నిర్దిష్ట సైజులో ప్యాకింగ్‌ చేస్తున్నారు. ఒక కేజీ లేదా అర కేజీ చొప్పున ప్యాకింగ్‌ చేసి అట్టపెట్టెలలో నిల్వ చేసుకుంటారు. కొంత తాండ్రను రాజమహేంద్రవరంలోని కోల్డ్‌ స్టోరేజీలలో నిల్వ చేసుకుని, ఇక్కడి వ్యాపారానికి అవసరమైనప్పుడు తెచ్చుకుని అమ్ముకుంటున్నారు. వేసవి అనంతరం తాటి పండ్లతో తాటి తాండ్రను సైతం తయారు చేస్తారు. పంచదార తాండ్రను కిలో రూ.200 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నారు. బెల్లం తాండ్రను రూ.250 నుంచి రూ.350కు అమ్ముతున్నారు.

లాభసాటిగా..

ఆత్రేయపురం గ్రామంలో వందల సంఖ్యలో పూతరేకుల వ్యాపారం కోసం స్టాళ్లు ఏర్పాటు చేశారు. వాటిలో ఏడాది పొడవునా మామిడి తాండ్రను కూడా విక్రయిస్తున్నారు. గతంలో ఈ తాండ్రను ముంబై, చైన్నె, కోల్‌కతా తదితర నగరాలకు ఎగుమతి చేసేవారు. కానీ ఇప్పుడు చాలా వరకూ స్థానిక స్టాళ్లలోనే అమ్ముడుపోతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. తద్వారా వ్యాపారం లాభసాటిగా సాగుతోందన్నారు. ఇటీవల కాలంలో మామిడి కాయలను జ్యూస్‌ ఫ్యాక్టరీలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాయి. దీంతో వాటికి డిమాండ్‌ ఏర్పడి, ధరలు కూడా పెరిగాయి. గతంలో ఒక మెట్రిక్‌ టన్ను రూ.2 వేలు ఉండగా, ఇప్పుడు సుమారు రూ.20 వేలు పలుకుతోంది. కొన్నిచోట్ల జ్యూస్‌తో జెల్లీ తాండ్రను యంత్రాలపై తయారు చేస్తున్నారు. ఆ తాండ్ర ఇక్కడ స్టాళ్లలో లభిస్తోంది.

మామిడి తాండ్ర

తయారీ కేంద్రంగా ఆత్రేయపురం

పూతరేకులతో పాటు ఎంతో ప్రసిద్ధి

మహిళలకు జీవనోపాధి

విదేశాలకూ ఎగుమతి

Advertisement
 
Advertisement
Advertisement