బాస్కెట్‌బాల్ విజేత రామచంద్రపురం మహిళా జట్టుకు, పురుషుల జట్టుకు ట్రోఫీ అందజేస్తున్న శాప్ చైర్మన్ రవినాయుడు, దాతలు
దేవరపల్లి: రామన్నపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో నిర్వహించిన అమరావతి రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ ఇన్విటేషన్ కప్ టోర్నమెంట్‌లో రామచంద్రపురం జట్టు విజేతగా నిలిచింది. బుధ, గురువారాల్లో హైదరాబాద్‌కు చెందిన కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఈ టోర్నమెంట్ నిర్వహించారు. హైస్కూల్ హెచ్‌ఎం, శాప్ డైరెక్టర్ పేరం రవీంద్రనాథ్ పర్యవేక్షణలో నిర్వహించిన టోర్నమెంట్‌లో పురుషులు, మహిళా విభాగాల్లో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం క్రీడాకారులు విజేతలుగా నిలిచారు. మహిళల విభాగంలో రామచంద్రపురం, ఏలూరు జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 42–31 పాయింట్లతో రామచంద్రపురం జట్టు విజేతగా నిలిచింది. ఏలూరు జట్టుకు ద్వితీయ, రామహేంద్రవరం జట్టుకు తృతీయ స్థానాలు లభించాయి. పురుషుల విభాగంలో రామచంద్రపురం – గుంటూరు జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 65 – 61 పాయింట్ల తేడాతో రామచంద్రపురం జట్టు విజయం సాధించింది. గుంటూరు జట్టు ద్వితీయ, రాజమహేంద్రవరం జట్టు తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. విజేతలకు ఆంఽధ్రప్రదేశ్ క్రీడా సాధికార సంస్థ (శాప్) చైర్మన్ అనిమని రవినాయుడు చేతుల మీదుగా కప్‌లు, నగదు బహుమతులు, మెడల్స్ అందజేశారు. గ్రామానికి చెందిన కూచిపూడి రమేష్ కప్‌లు సమకూర్చగా, కేర్ ఫౌండేషన్ చైర్మన్ రాపాక గాంధీ ప్రథమ నగదు బహుమతిగా పురుషుల జట్టుకు రూ.50 వేలు, రాపాక యూత్ అధ్యక్షుడు రాపాక అశోక్ ద్వితీయ బహుమతిగా రూ.30 వేలు, ఐటీ కంపెనీ ప్రతినిధులు గోపాల్, రవి తృతీయ బహుమతిగా రూ. 20 వేలు సమకూర్చారు. మహిళల జట్టుకు ప్రథమ బహుమతిని ఇమ్మణి సూరిబాబు రూ. 30 వేలు, కొయ్యలమూడి చినబాబు ద్వితీయ బహుమతిని రూ. 20 వేలు, తృతీయ బహుమతిని అనిశెట్టి ప్రభాకరరావు రూ. 10 వేలు సమకూర్చారు. శాప్ డైరెక్టర్ జగదీశ్వరి, ఆనంద్ ఎడ్యుకేషనల్ విద్యా సంస్థల చైర్మన్ సువర్ణరాజు, పరమేశు బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ జీఎం శివప్రసాద్, కేర్ ఫౌండేషన్ సీఈఓ రాపాక శ్రీ పాల్గొన్నారు.


