● బతికినా.. బతకలేకపోతున్నా..
ఎలా బతకాలి?
సామర్లకోట: ఒకరూ ఇద్దరూ కాదు.. ఏకంగా 28 మందిని బలి తీసుకున్న ఘోర విస్ఫోటం ఆ కుటుంబాల్లో ఎప్పటికీ తీరని మహావిషాదాన్నే మిగిల్చింది. సామర్లకోట మండలం వేట్లపాలెంలోని సూర్యశ్రీ ఫైర్ వర్క్స్‌లో గత ఫిబ్రవరి 28న ఈ మృత్యు విలయ విన్యాసం ఇప్పటికీ బాధితుల కళ్ల ముందు మెదులుతూనే ఉంది. విస్ఫోటం రగిల్చిన చిచ్చులో సంఘటన స్థలంలోనే ఆ రోజు 20 మంది సజీవదహనమైపోయారు. తీవ్రంగా గాయపడిన మరో తొమ్మిది మందిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. వీరిలో చికిత్స పొందుతూ ఎనిమిది మంది ఒకరొకరుగా మరణించారు. ఈ ప్రమాదం నుంచి ఆ రోజు ప్రాణాలతో బయట పడిన ఒకే ఒక్కడు పెద్దాపురానికి చెందిన చాపల శామ్యూల్. అయితే, నాటి ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. మృత్యులోకపు అంచుల వరకూ వెళ్లి.. మృత్యువును జయించి, సుదీర్ఘ చికిత్స అనంతరం ప్రాణాలు దక్కించుకున్న మరో వ్యక్తి సామర్లకోట కుమ్మర వీధికి చెందిన వేమగిరి దావీదు. వైద్యుల కృషే ఫలించిందో.. బతకాలనే ఆశే అతడి ఊపిరి నిలిపిందో.. ప్రార్థించిన దేవుడే కరుణించాడో కానీ.. సుమారు 40 రోజుల చికిత్స అనంతరం కోలుకుని దావీదు కొద్ది రోజుల కిందట ఇంటికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా తనను కలసిన ‘సాక్షి’కి.. నాటి ఘోర కలిని, కుటుంబ పోషణకు పడుతున్న ఇబ్బందులను అతడు వివరించాడు.
క్షతగాత్రులకు సాయమేదీ?
బాణసంచా విస్ఫోటం జరిగిన వెంటనే కేంద్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించింది. కానీ, ఇప్పటి వరకూ ఆ సహాయం అందలేదని బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షలు, రైస్ మిల్లర్ల అసోసియేషన్ నుంచి రూ.2 లక్షలు మాత్రమే అందాయని అంటున్నారు. క్షతగాత్రులకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఎటువంటి సహాయమూ చేయలేదు. దీంతో, దావీదు కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
బాణసంచా ఘోర విస్ఫోటంలో తనువెల్లా దహించుకుపోయింది.. కోలుకున్నాక చర్మం, కండరాలు బిగిసిపోయాయి.. అవయవాలు స్వాధీనంలోకి రావడం లేదు.. ఏ పని చేయడానికీ సహకరించడం లేదు.. ప్రాణాలతో బయట పడినా.. బతికే దారి కానరావడం లేదు.. సామర్లకోట మండలం వేట్లపాలెంలోని సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రంలో గత ఫిబ్రవరి 28వ తేదీన జరిగిన దుర్ఘటనలో తీవ్రంగా కాలి, గాయపడి, సుదీర్ఘ చికిత్స అనంతరం కోలుకున్న వేమగిరి దావీదు దుస్థితి ఇది.
వేట్లపాలెం బాణసంచా విస్ఫోటంలో
మృత్యుంజయుడి దుస్థితి
సుదీర్ఘ చికిత్సతో నిలిచిన ప్రాణాలు
ఇటీవల ఇంటికి చేరుకున్న
వేమగిరి దావీదు
పని చేయడానికి సహకరించని శరీరం
ఏ పనీ చేయలేని దుస్థితి
కుటుంబ పోషణకు ఇబ్బందులు
ప్రభుత్వమే ఆదుకోవాలి
సుమారు పదేళ్లుగా సామర్లకోట, వేట్లపాలేల్లో బాణసంచా తయారీలో పని చేసినా ఎప్పుడూ ఇంత పెద్ద ప్రమాదం జరగలేదు. తెలిసిన విద్య కావడం, బాణసంచా తయారీని బట్టి కూలి ఇస్తూండటంతో రోజుకు రూ.1,000 నుంచి రూ.1,200 సంపాదించవచ్చనే ఆశతో ఈ పనికి వెళ్లేవాడిని. బాణసంచా ప్రమాదంలో శరీరం తీవ్రంగా కాలిపోవడంతో అవయవాలు సహకరించడం లేదు. మా అమ్మ రాఘవ 57 సంవత్సరాల వయస్సులోనూ తాటాకు విసనకర్రలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఆమె సంపాదనపై ఆధారపడి అద్దె ఇంట్లో జీవిస్తున్నాం. రేకులతో ఉన్న ఇంట్లో వేడి రావడంతో పైన తాటాకులు వేసుకుని నివాసం ఉంటున్నాం. నాకు భార్య విజయలక్ష్మి, కుమారుడు వినయ్ కుమార్, కుమార్తెలు రమ్యప్రియ, కరుణ ఉన్నారు. కొడుకు పదో తరగతి చదివి మానేశాడు. ఏ పనీ చేయడం లేదు. పెద్ద కుమార్తె పది, చిన్న కుమార్తె ఎనిమిది తరగతుల్లోకి వస్తున్నారు. ఏ పనీ చేయలేని పరిస్థితిలో వారిని ఏవిధంగా పోషించుకోవాలో తెలియడం లేదు. కోలుకుని ఇంటికి వచ్చిన తరువాత ప్రభుత్వం నా క్షేమ సమాచారం తెలుసుకోలేదు. కనీసం దివ్యాంగ పింఛను ఇచ్చి ఆదుకోవాలి. అత్తగారు ఇచ్చిన స్థలం బ్యాంకులో ఉండటంతో ఇల్లు కట్టుకోవడానికి గతంలో రూ.8 లక్షల అప్పు చేసి స్థలం విడిపించాను. ఈ ప్రమాదం తరువాత ఇప్పుడు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. అప్పులు తీర్చలేని దుస్థితిలో ఉన్నాను. కుటుంబాన్ని పోషించుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలి.
– వేమగిరి దావీదు, సామర్లకోట


