బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తాగడానికి గుక్కెడు నీళ్లు దొరకక గ్రామీణ ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. గ్రామాల శివారు ప్రాంతాల్లో ప్రభుత్వం శాశ్వత మంచినీటి పథకాలు ఏర్పాటు చేయకపోవడంతో ఏటా వేసవిలో ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని 385 గ్రామ పంచాయతీల పరిధిలో 667 శివారు ప్రాంతాలున్నాయి. ప్రధాన గ్రామాలకు వాటర్ ట్యాంకులు ఉండటంతో పైపులైన్ల ద్వారా మంచినీటి సరఫరా జరుగుతుంది. కానీ, ఈ సౌకర్యం లేకపోవడంతో శివారు ప్రాంతాలకు మంచినీరు అందని దుస్థితి. దీంతో, మార్చి నెలాఖరు నుంచే శివారు ప్రాంతాల ప్రజలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు.
కార్యాచరణ ప్రణాళిక లేక..
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేసవి కార్యాచరణ ప్రణాళిక అమలు చేయడం లేదు. దీంతో, శివారు ప్రజలకు మంచినీటి ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలో గుర్తించిన 667 శివారు ప్రాంతాలకు గతంలో ట్యాంకర్లతో మంచినీరు సరఫరా చేసేవారు. ప్రస్తుతం ఆవిధంగా చేయకపోవడంతో అక్కడి ప్రజలు గుక్కెడు నీటి కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి. సామర్లకోట మండలం వీకే రాయపురం శివారు సత్యవరపుపేట వాసులు 20 రోజులుగా మంచినీరు లేక ఇబ్బంది పడుతున్నామంటూ రెండు రోజుల క్రితం గ్రామంలో ఆందోళన చేశారు. అయినప్పటికీ వారికి మంచినీరు అందించేందుకు ప్రభుత్వం ఇప్పటి వరకూ చర్యలు తీసుకోలేదు. సత్యవరపుపేటతో పాటు సామర్లకోట మండలం మామిళ్లదొడ్డి, వల్లూరు, బోయినపూడి, కాపవరం తదితర గ్రామాల ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. జగ్గంపేట మండలం రాజపూడి గ్రామంలో నీటి ఎద్దడి రావడంతో గ్రామ పంచాయతీ నిధులతో సమస్య పరిష్కరించుకోవాల్సి వచ్చింది. గొల్లప్రోలు మండలంలోని 11 శివారు ప్రాంతాల్లో తాగునీటి సమస్య నెలకొంది. జిల్లావ్యాప్తంగా పలు గ్రామాల శివారు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. ఎండలు మరింతగా ముదిరే మే నెలలో సమస్య మరింత తీవ్రరూపం దాల్చుతుందని, ప్రభుత్వమే ట్యాంకర్లతో మంచినీరు సరఫరా చేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.
నిధులివ్వని ప్రభుత్వం
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వేసవి కార్యాచరణ ప్రణాళిక అమలు చేసేవారు. దీని ద్వారా శివారు ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీరు అందించేవారు. దీనికోసం జిల్లాకు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకూ కేటాయించేవారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శివారు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. ఫలితంగా పైపుల ద్వారా నీరు రాక, ట్యాంకర్ల ద్వారా సరఫరా కాక అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నయాపైసా కూడా విదల్చకపోగా.. పైపులైన్లు, ట్యాంకులకు మరమ్మతులు చేసి, గ్రామ పంచాయతీల ద్వారానే శివారు ప్రాంతాలకు మంచినీరు సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చి ఊరుకుంది.
మండలం శివారు
ప్రాంతాలు
గండేపల్లి 20
గొల్లప్రోలు 11
జగ్గంపేట 21
కాజులూరు 32
కాకినాడ రూరల్ 31
కరప 35
కిర్లంపూడి 21
కోటనందూరు 24
పెదపూడి 29
పెద్దాపురం 25
పిఠాపురం 29
ప్రత్తిపాడు 39
రౌతులపూడి 47
సామర్లకోట 28
శంఖవరం 37
తాళ్లరేవు 51
తొండంగి 54
తుని 50
యు.కొత్తపల్లి 53
ఏలేశ్వరం 30
పంచాయతీలో నిధులు లేక..
ఇప్పటికే గ్రామ పంచాయతీల ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది. సిబ్బంది జీతాలు, వీధి దీపాల నిర్వహణ వంటి వాటికే నిధులు సరిపోక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈ తరుణంలో ప్రభుత్వం ఆదేశించినట్టుగా పంచాయతీల ద్వారా శివారు ప్రాంతాలకు మంచినీటి సరఫరా ఎలా సాధ్యమవుతుందని గ్రామ ప్రత్యేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గ్రామాలకు సర్పంచులుంటే స్థానికంగా ట్యాంకర్ల ద్వారా ఎవరో ఒకరి సహాయంతోనో, అవసరమైతే తన సొంత నిధులతోనో శివారు ప్రాంతాలకు తాగునీరు అందించేవారు. కానీ, ఏప్రిల్ మొదటి వారంలో గ్రామ పంచాయతీల పాలకవర్గ కాలపరిమితి ముగిసిపోయింది. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. వారు ఆయా మండల కేంద్రాల్లో మాత్రమే ఉంటున్నారు. ఏదో ఒక సమయంలో గ్రామ పంచాయతీకి వచ్చి వెళ్లిపోతున్నారని, తాగునీరు తదితర స్థానిక సమస్యలను పట్టించుకోవడం లేదని గ్రామీణ ప్రజలు మండిపడుతున్నారు.
చాలా ఇబ్బందులు పడుతున్నాం
గ్రామంలోని పైపులైన్ల ద్వారా గత 20 రోజులుగా మంచినీరు సరఫరా కావడం లేదు. గ్రామ పంచాయతీ అధికారులు కూడా ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు. ఉన్నతాధికారులును కోరినా పట్టించుకోవడం లేదు. తాగునీటి కోసం రోడ్డెక్కి ధర్నా కూడా చేశాం. అయినప్పటికీ ప్రభుత్వానికి మా సమస్య తెలియడం లేదు.
– రేలంగి రాంబాబు, వీకే రాయపురం, సామర్లకోట మండలం
ప్రత్యేకంగా నిధులివ్వలేదు
ఈ ఏడాది జిల్లాలోని 667 శివారు ప్రాంతాల్లో మంచినీటి ఎద్దడి ఉంటుందని గుర్తించాం. ఆయా ప్రాంతాలకు ట్యాంకర్లతో మంచినీరు సరఫరా చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులేవీ కేటాయించలేదు. గ్రామాల్లో తాగునీటి సమస్యలుంటే ఆయా గ్రామ పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్ ద్వారా మాత్రమే నిధులు మంజూరు చేస్తున్నారు.
– అబ్దుల్ మతిన్, ఆర్‌డబ్ల్యూఎస్ జిల్లా ఇన్‌చార్జి ఎస్‌ఈ
పెరుగుతున్న ఎండలు
గొంతెండుతున్న గ్రామాలు
జిల్లాలో 667 శివారు ప్రాంతాలు
అక్కడ తాగునీటికి
నయాపైసా ఇవ్వని సర్కారు
గత ప్రభుత్వ హయాంలో రూ.2 కోట్ల
నుంచి రూ.3 కోట్ల కేటాయింపు


