‘ఉపాధి’ అమలులో ప్రభుత్వం విఫలం | - | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’ అమలులో ప్రభుత్వం విఫలం

Apr 23 2026 7:30 AM | Updated on Apr 23 2026 7:30 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): ఉపాధి హామీ పథకం అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు పేద కార్మికుల జీవితాలను దెబ్బ తీస్తున్నాయని వైఎస్సార్‌ సీపీ ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు చెక్కా చక్రవర్తి బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఈ పథకంలో మార్పులు చేసి కొత్త విధానాలను తీసుకురావడంపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోందన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో పనిదినాలను 57.6 శాతానికి తగ్గించడం కార్మికులకు ఎంతో నష్టమన్నారు. ఈ పథకం కింద 2024–25లో 40.67 లక్షల మందికి ఉపాధి లభించగా, ప్రస్తుత సంవత్సరం అది 23.4 లక్షలకు పడిపోయిందని, దాదాపు 17.37 లక్షల మంది కార్మికులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో 25.55 కోట్లు, గత ఏడాది 24.52 కోట్ల పనిదినాలుండగా, ఈసారి 18.59 కోట్లకు తగ్గిపోయన్నారు. ఫలితంగా గతంలో నెలకు రూ.11 వేలకు పైగా సంపాదించే కార్మికులకు ఇప్పుడు కనీస వేతనం అందడం కూడా కష్టమైందని తెలిపారు. లిబ్‌టెక్‌ సంస్థ నివేదిక ప్రకారం, ప్రభుత్వాల నిర్లక్ష్యంతో 12.33 లక్షల మంది శ్రామికులు ఉపాధి కోల్పోయారన్నారు. లేబర్‌ బడ్జెట్‌ పెంచి, హాజరు పట్టికల్లో జరుగుతున్న అవకతవకలను అరికట్టాలని చక్రవర్తి డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.1,200 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. నిజమైన కార్మికులకు పని కల్పించకుండా అధికార పార్టీ అనుకూలురకు మాత్రమే లబ్ధి చేకూరుస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో దివ్యాంగ కార్మికులకు విస్త్తృతంగా లబ్ధి చేకూరగా, ప్రస్తుతం ఆ సంఖ్య తగ్గిపోయిందన్నారు. కార్మిక వర్గం పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తోందని విమర్శించారు. పెండింగ్‌ బకాయిలు వెంటనే చెల్లించి, చట్ట ప్రకారం ప్రతి కార్మికుడికి 100 రోజుల పని కల్పించాలని, హాజరు పట్టికలో అక్రమాలను అరికట్టి, అవినీతికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని చక్రవర్తి డిమాండ్‌ చేశారు. లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు.

యుద్ధోన్మాదంపై పోరాడాలి

గండేపల్లి (జగ్గంపేట): సామ్రాజ్యవాద దురహంకార అధర్మ యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా లెనిన్‌ స్ఫూర్తితో పోరాడాలని ఆంధ్రప్రదేశ్‌ రైతుకూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు పిలుపునిచ్చారు. రష్యన్‌ విప్లవ యోధుడు లెనిన్‌ జయంతి, సీపీఐ (ఎంఎల్‌) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగ్గంపేట ట్రావెలర్స్‌ బంగ్లా నుంచి పోలీస్‌ స్టేషన్‌ మీదుగా పంచాయతీ కార్యాలయం వరకూ బుధవారం ప్రదర్శన నిర్వహించారు. తొలుత లెనిన్‌ చిత్రపటానికి పూలమాల వేశారు. అనంతరం ఆ చిత్రపటాన్ని ప్రదరిస్తూ, ప్లకార్డులతో జరిగిన ఈ ప్రదర్శనలో పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరాంజనేయులు మాట్లాడుతూ, అత్యంత దుర్మార్గంగా దేశాధినేతలను హతమార్చే స్థాయికి అమెరికా తెగబడుతోందన్నారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ చేస్తున్న సంయుక్త దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చెప్పినట్టు వింటున్న మోదీ మన దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

విలువ ఆధారిత వ్యవసాయ

ఉత్పత్తులకు ప్రోత్సాహం

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): విలువ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహిస్తామని కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ ఎలియాజర్‌ ఆధ్వర్యాన మహిళా పారిశ్రామికవేత్తలు విలువ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల గురించి ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలో వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను 50 మంది మహిళా వ్యాపారవేత్తలు విడుదల చేయడం హర్షణీయమన్నారు. వీరితో సంవత్సరానికి రూ.3 కోట్ల వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నామని ఎలియాజర్‌ తెలిపారు. రాగులు, కొర్రలతో లడ్డూలు, బియ్యం నూక వంటి ఉత్పత్తులు, అటుకులు, మురుకులు, చక్కిలాల వంటివి తయారు చేసి ఎగుమతి చేస్తున్నామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement