పేదల ఇళ్ల స్థలాల జోలికొస్తే ఊరుకునేది లేదు | - | Sakshi
Sakshi News home page

పేదల ఇళ్ల స్థలాల జోలికొస్తే ఊరుకునేది లేదు

Apr 23 2026 7:30 AM | Updated on Apr 23 2026 7:30 AM

పిఠాపురం: పేదల ఇళ్ల స్థలాల జోలికొస్తే ఊరుకునేది లేదని, నర్సింగపురం ప్రభుత్వ లే అవుట్‌లో పేదలకు వెంటనే ఇళ్లు నిర్మించాలని వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎంపీ వంగా గీత డిమాండ్‌ చేశారు. ఆ భూమిలో ఏ ఇతర నిర్మాణం చేపట్టినా అడ్డుకుంటామని, లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని హెచ్చరించారు. నిరుపేద లబ్ధిదారులకు గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం పిఠాపురం మండలం నర్సింగపురంలో జగనన్న కాలనీకి భూమిని కేటాయించిన విషయం తెలిసిందే. దీనిని తెలంగాణకు చెందిన ప్రైవేటు స్కూలు నిర్మాణానికి కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ ఆ భూమి వద్ద లబ్ధిదారులతో కలసి బుధవారం వంగా గీత ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన వెంటనే స్థలాలు ఇచ్చి, ఇళ్లు నిర్మిస్తామన్న చంద్రబాబు ప్రభుత్వం.. ఆ దిశగా ఎటువంటి చర్యలూ తీసుకోకపోగా, ఇచ్చిన స్థలాలను లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. నర్సింగపురం జగనన్న కాలనీలో లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, రోడ్లు, ఇతర సౌకర్యాలు కల్పించి, వెంటనే ఇళ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కళాశాలలు, స్కూళ్లు నిర్మించడానికి ఎన్నో ప్రభుత్వ స్థలాలుండగా, నర్సింగపురంలో పేదలకు కేటాయించిన స్థలాన్ని ప్రైవేటు స్కూలుకు కట్టబెట్టడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. నర్సింగపురంలో పేదలకు పట్టాలు ఇచ్చి, రిజిస్ట్రేషన్లు చేసిన విషయాన్ని పక్కన పెట్టి, ఆ భూములు ఖాళీగా ఉన్నట్లు తప్పుడు నివేదిక ఇచ్చారని అన్నారు. కేవలం వైఎస్సార్‌ సీపీకి పేరు వస్తుందనే అక్కసుతో కావాలనే పేదల స్థలాలను కాజేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. నిరుపేదల ఇళ్ల స్థలాలపై ఎవరు ఎటువంటి అక్రమాలు చేయాలని ప్రయత్నించినా అడ్డుకుని తీరుతామన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి రోజులు దగ్గర పడినట్టేనని అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ నియోజకవర్గంలోనే ఇంత దారుణం జరుగుతూంటే నేతలందరూ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పవన్‌ కల్యాణ్‌ పునరాలోచించి లబ్ధిదారులకు న్యాయం చేయాలని గీత కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు, నాయకులు కొత్తెం దత్తుడు, ఇళ్ల స్థలాల లబ్ధిదారులు పాల్గొన్నారు.

నర్సింగపురంలో పేదలకు ఇళ్లు నిర్మించాలి

ఆ భూమిలో ఏ ఇతర నిర్మాణం చేపట్టినా అడ్డుకుంటాం

న్యాయం జరిగే వరకూ పోరాడతాం

వైఎస్సార్‌ సీపీ నేత వంగా గీతా విశ్వనాథ్‌

లబ్ధిదారులతో కలసి ఆందోళన

Advertisement
 
Advertisement
Advertisement