గోడ దూకి.. పొలంలో పడిపోయా.. | - | Sakshi
Sakshi News home page

గోడ దూకి.. పొలంలో పడిపోయా..

Apr 23 2026 7:30 AM | Updated on Apr 23 2026 7:30 AM

‘ఆ రోజు బాణసంచా తయారీ పనిలో సుమారు 30 మంది ఉన్నాం. మధ్యాహ్నం భోజనం చేసి, కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని, 2.30 గంటలకు పనిలోకి దిగాం. ఆ సమయంలో నా చుట్టూ 10 మంది పని చేస్తున్నారు. అలసటగా ఉండటంతో పైకి లేచి నిలబడ్డాను. అదే సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడుతో ఆ ప్రదేశమంతా పొగతో నిండిపోయింది. ఎవ్వరికీ ఏమీ చెప్పలేని, ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి. కొంత దూరం పరుగెత్తి పడిపోయాను. అయినప్పటికీ ఏదో ఒక విధంగా ప్రాణాలతో బయట పడాలనే ఆశతో గోడ దూకి పొలంలో పడ్డాను. అప్పటికే మంటలు వ్యాపించాయి. ఎలాగో గోదావరి కాలువ గట్టుకు చేరుకున్నాను. మొదట నన్ను వేట్లపాలెం పీహెచ్‌సీకి, అక్కడి నుంచి కాకినాడ ఆస్పత్రికి తరలించారు. నేను చికిత్స పొందుతున్న వార్డులోనే రోజుకు ఒకరిద్దరు చనిపోయేవారు. నేను ధైర్యంతో దేవుడిని ప్రార్థించుకున్నాను. అందువల్లనే ప్రాణాలతో మిగిలి, నా కుటుంబాన్ని మళ్లీ చూడగలిగాను’ అంటూ ప్రమాదం జరిగిన తీరును, ప్రాణాలు దక్కించుకునేందుకు తాను చేసిన ప్రయత్నాలను దావీదు చెమ్మగిల్లిన కళ్లతో వివరించాడు.

మనిషిగా ఉన్నా.. ఏ పనీ చేయలేకపోతున్నా..

ప్రమాదం నుంచి ప్రాణాలతో బయట పడి ఇంటికి వచ్చానన్న మాటే కానీ, తనను ఇప్పటి వరకూ పట్టించుకున్న నాథుడు లేడని దావీదు ఆవేదన వ్యక్తం చేశాడు. నాటి ప్రమాదంలో శరీరం కాలిపోవడంతో చర్మం, కండరాలు బిగుసుకుపోయాయి. దీంతో, కాళ్లు, చేతులు, ఇతర అవయవాలు పూర్తి స్థాయిలో సాగని దుస్థితి. మామూలుగా నడవడానికే దావీదు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో, ఏ పనీ చేయలేని దుస్థితిని ఎదుర్కొంటున్నాడు. ‘ఇంటికి వచ్చి, మనిషిగా ఉన్నాను తప్ప ఏ పనీ చేయలేకపోతున్నా. కూలి పనికి వెళ్లే పరిస్థితి లేదు. నాకు అందిన రూ.2 లక్షల ఆర్థిక సాయం వైద్య ఖర్చులకే సరిపోయింది’ అని దావీదు ఆవేదన వ్యక్తం చేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement