పుస్తకం.. అక్షర సుమాల హారం | - | Sakshi
Sakshi News home page

పుస్తకం.. అక్షర సుమాల హారం

Apr 23 2026 7:30 AM | Updated on Apr 23 2026 7:30 AM

రచనలకు పుట్టినిల్లు ఉమ్మడి జిల్లా

సమాజ హితానికి ఎన్నో ప్రచురణలు

నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం

కపిలేశ్వరపురం: పుస్తకం.. అక్షర సుమాల హారం. జ్ఞాన దీపాల సమూహం. భావాలను వ్యక్తపరిచే ఓ సాధనం. కొత్త విషయాలను తెలిపే ఆయుధం.. అలాంటి పుస్తక సంపదను కాపాడుకోవడానికి, భవిష్యత్‌ తరాలకు జ్ఞానాన్ని అందించేందుకు యునెస్కో ఏప్రిల్‌ 23న ప్రపంచ పుస్తక దినోత్సవంగా ప్రకటించింది. ఆ రోజున సదస్సులు, సమావేశాలు, పరిశోధనాపరమైన అంశాలపై చర్చలు చేపట్టాలని సూచించింది. గురువారం ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ఈ కథనం.

కందుకూరి వీరేశలింగం పంతులు 1903లో మద్రాస్‌లో ఉంటూ స్వీయ చరిత్రను తొలుత 112 పేజీలతో ఆయన సొంత చింతామణి ప్రెస్‌లో ముద్రించారు. మిగిలిన భాగాలను బెంగళూరులో ఉంటుండగా, పూర్తి చేసినట్టు ఆయన స్వీయ చరిత్ర పుస్తకంలో 1920 డిసెంబర్‌ 15న రాసిన ముందుమాటలో తెలిపారు. రామచంద్రపురం పట్టణానికి చెందిన డాక్టర్‌ చెలికాని రామారావు మెమోరియల్‌ కమిటీ ఇప్పటి వరకూ 21 పుస్తకాలను ప్రచురించింది. మారుమూల గ్రామమైన కపిలేశ్వరపురం మండలం టేకికి చెందిన కావూరి పట్టాభిరామయ్య ‘టేకి నుండి టెగ్జాస్‌ వరకూ’ పేరుతో రాసుకున్న తన ఆత్మకథను 1981 మే నెలలో వెలువరించారు. అప్పటి ఏపీ ప్రభుత్వ ఆస్థాన కవి డాక్టర్‌ దాశరథి, మహాకవి డాక్టర్‌ బోయి భీమన్నలు కావూరి కృషిని ప్రశంసిస్తూ పలు మాటలు ఆ పుస్తకంలో రాశారు.

కొనసాగుతున్న రచన

కందుకూరి వీరేశలింగం 1920లో రాసుకున్న స్వీయ చరిత్రను చదవడంలో ఆధునిక పాఠకులకు భాషాపరమైన ఇబ్బంది తలెత్తుతుంది. ఆ పుస్తకానికి ఉన్న ప్రాశస్త్యాన్ని డాక్టర్‌ చెలికాని రామారావు మెమోరియల్‌ కమిటీ అధ్యక్షుడు చెలికాని స్టాలిన్‌ గుర్తించి, అదే పేరుతో కొత్త పుస్తకాన్ని తీసుకొచ్చారు. 800 పేజీల ఆ పుస్తకాన్ని కాకినాడకు చెందిన పీఎస్‌ ప్రకాశరావు సరళతరం చేస్తూ, 172 పేజీలకు సంక్షిప్తం చేశారు. 2025 జూలైలో ప్రథమ ముద్రణ రామచంద్రపురంలో, రెండో ముద్రణ కాకినాడలో, మూడో ముద్రణ ఈ నెల 16న రాజమహేంద్రవరంలోని ఏబీ నాగేశ్వరరావు పార్క్‌లో సీనియర్‌ సిటిజన్స్‌, ప్రజా సంక్షేమ వేదిక పర్యవేక్షణలో ఆవిష్కృతమయ్యాయి. పిఠాపురానికి చెందిన మేకా గౌరవ్‌ జర్మన్‌ రచయిత విలియం లిబ్నిక్‌ పుస్తకాన్ని ‘సాలీడు, ఈగ’ పేరుతో అనువాదం చేశారు. నందిమూపురం, పురుషుడు– సీ్త్ర, చదువు అంటే ఏమిటి?, ప్రత్యామ్నాయ సినిమాలు తదితర పుస్తకాలను రాశారు. ఈ నెల కాకినాడలోని దంటు కళాక్షేత్రం యంగ్‌మెన్స్‌ హ్యాపీ క్లబ్‌లో ‘తెలుగు నాటకరంగం– నాడు– నేడు– రేపు’ పేరుతో గౌరవ్‌ సంపాదకత్వాన తీసుకొచ్చిన వ్యాస సంకలనం పుస్తకాన్ని ఆవిష్కరించారు. కాకినాడకు చెందిన గనారా తదితరుల బృందం పర్యావరణ పరిరక్షణ లక్ష్యంతో భారీ పరిశ్రమలపై ప్రత్యేక సర్వే చేశారు. అందులోని అంశాలను ‘కడలి కల్లోలం’ పేరుతో నవలగా రాయగా 2016 వైజాగ్‌లో నిర్వహించిన జాతీయ సదస్సులో ప్రముఖ ఆర్థికవేత్త డా.ప్రభాత్‌ పట్నాయక్‌ ఆవిష్కరించారు. ఎలాంటి సాహితీ పునాది లేని కుటుంబానికి చెందిన దేవగుప్తం పేరలింగం మూఢ నమ్మకాల గుట్టును రట్టు చేసే పుస్తకాలను తన సైకిల్‌కు కట్టుకుని క్షేత్ర స్థాయిలో పంచుతూ చర్చ పెట్టేవారు. తన సైకిల్‌కు ‘హేతువాద చైతన్య రథం’ పేరు పెట్టుకున్నారు. అధ్యయనం అలవాటు చేసుకుని 13 పుస్తకాలను సొంతంగా రచించారు. తన ఇంట్లో ‘సైన్స్‌ గ్రంథాలయం’ నడిపారు. పేరలింగం 82 ఏళ్ల వయసులో 2014 ఏప్రిల్‌ 14న తుదిశ్వాస విడిచే వరకూ తన కృషి కొనసాగించారు. కాకినాడకు చెందిన రావు కృష్ణారావు రచనలు జంగాలోపాఖ్యానం, ఆధునిక బేతాళ కథలు, బతుకుపోరు కథా సంకలనం, మనిషి, సమాజం తదితర పుస్తకాలు సమాజ మార్పునకు కృషి చేసేలా మనిషికి ప్రేరణ కల్పిస్తాయి.

సాహిత్య కార్యక్రమాలు ఇలా..

ఈ నెల 5న రాజమహేంద్రవరంలో వారణాసి సుబ్రహ్మణ్యం రచించిన ‘శతాయుష్మాన్‌ భవ’ పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అమెరికాలోని ఏటూరి సాహిత్యభిమాన సమితి ఈ ఏడాది జనవరిలో తొలిసారిగా వేటూరి సుందరరామమూర్తి సాహిత్యాన్ని ఆరు సంపుటాలు, ఎనిమిది గ్రంథాలుగా రూపొందిన పుస్తకాలను రాజమహేంద్రవరంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయానికి అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో విజ్ఞాన వికాసానికి గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం 2021 ఆగస్టులో వైఎస్సార్‌ విలేజ్‌ డిజిటల్‌ గ్రంథాలయాల వ్యవస్థను తీసుకొచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం వాటిని విస్మరిస్తోంది.

సామాజిక బాధ్యతగా..

పుస్తకాన్ని రచించడం, అధ్యయనం చేయడం సామాజిక బాధ్యత. ఏపుస్తకమైనా సమాజ మార్పునకు ప్రేరణ కలిగించేదిగా ఉండి తీరాలి. మూఢత్వాన్ని, ఛాందసాన్ని ప్రజలకు దూరం చేసేదిలా ఉండాలి.

– గనారా, రచయిత, కాకినాడ

వివిధ కాలాలకు వారధిలా..

గత, వర్తమాన, భవిష్యత్‌ సామాజిక పరిస్థితులను తెలిజేసే సాధనం పుస్తకం. ఆయా కాలాలకు వారధిగా పుస్తకం ఉండాలి. 1920 నాటి రోజుల్లోని కందుకూరి స్వీయ చరిత్ర నేటికీ ప్రాంగికత కలిగి ఉంది. పుస్తకం చదవడం రోజువారీ జీవితంలో భాగం కావాలి.

– డాక్టర్‌ పీఎస్‌ ప్రకాశరావు, రచయిత, కాకినాడ

Advertisement
 
Advertisement
Advertisement