మార్కులు పెంచుకుందాం రండి | - | Sakshi
Sakshi News home page

మార్కులు పెంచుకుందాం రండి

Apr 23 2026 7:30 AM | Updated on Apr 23 2026 7:30 AM

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం

విద్యార్థులకు అవకాశం

27 వరకూ దరఖాస్తు

చేసుకునేందుకు అవకాశం

రాజమహేంద్రవరం రూరల్‌: ఇంటర్‌ బోర్డు శుభవార్త చెప్పింది. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు సైతం మార్కులు పెంచుకునేందుకు ఇంప్రూవ్‌మెంట్‌ కోసం పరీక్షలు రాసే అవకాశాన్ని కల్పించింది. వాస్తవానికి 2024లో ఈ విధానం అమల్లోకి రావాల్సి ఉండగా.. ఆచరణకు నోచుకోలేదు. ఎట్టకేలకు ఇంటర్‌ బోర్డు నిర్ణయం అమల్లోకి తీసుకొచ్చింది. సప్లిమెంటరీ పరీక్షలకు ఈ నెల 27వ తేదీలోగా ఫెయిలైన విద్యార్థులతో పాటు ఇంఫ్రూవ్‌మెంట్‌ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు. మే 21వ తేదీ నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మొదలు కానున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మాత్రమే ఇంప్రూవ్‌మెంట్‌కు అవకాశం ఉండేది. అయితే ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులకు సైతం అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.

ఎక్కువ మార్కులే పరిగణనలోకి..

ఇంప్రూవ్‌మెంట్‌కు హాజరయ్యే విద్యార్థుల్లో ఎన్నో అనుమానాలు, మరెన్నో సందేహాలకు ఇంటర్‌ బోర్డు చెక్‌ పెట్టింది. ఎక్కువ మార్కులనే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. మార్చిలో జరిగిన ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల్లో ఏదైనా సబ్జెక్టుల్లో సాధించిన మార్కులు.. ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షల్లో సాధించిన మార్కులు.. ఏవీ ఎక్కువ మార్కులు అయితే వాటినే ఇంటర్‌ బోర్డు పరిగణనలోకి తీసుకోనుంది. ఇది కేవలం ఫీజులు దండుకునేందుకు వేసిన ఎత్తుగడ అని కొందరు విద్యార్థి సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. జిల్లాలో ఇంటర్‌ ప్రఽథమ, ద్వితీయ సంవత్సరం జనరల్‌, ఓకేషనల్‌ కలిపి మొత్తం 43,108 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో ద్వితీయ సంవత్సరం జనరల్‌ విద్యార్థులు 18,337 మంది పరీక్షలు రాయగా, 15,707 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో కనీసం రెండు వేల మంది ఇంప్రూవ్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement