రాజమహేంద్రవరం రూరల్: జేఈఈ మెయిన్స్ రెండో విడత ఫలితాల్లో రాజమహేంద్రవరం ఎస్‌ఆర్ విద్యా సంస్థకు చెందిన విద్యార్థి చిట్టాల మోహన్‌స్వరూప్ ఆల్ ఇండియా 790వ ర్యాంకును సాధించాడు. అదే విధంగా యర్ర గుణవీరబాబు జాతీయ స్థాయిలో 1568వ ర్యాంకు పొందాడు. ఎస్‌ఆర్ విద్యా సంస్థలలో చదువుతున్న విద్యార్థులు వివిధ కేటగిరీలలో అద్భుతమైన ఘన విజయాలు సాధించారని రాజమహేంద్రవరం జోనల్ ఇన్‌చార్జి మురళీధర్ తెలిపారు. ఆ విద్యా సంస్థల డైరెక్టర్ ఎ.సంతోష్‌రెడ్డి, సీఈఓ సురేంద్రరెడ్డి, జీఎం రాజేంద్రప్రసాద్, డీజీఎం రమణ, రాజమహేంద్రవరం జోనల్ ఇన్‌చార్జి మురళీధర్‌లు విద్యార్థులను, అధ్యాపకులను అభినందించారు.
మందుబాబులకు జైలు శిక్ష
పిఠాపురం: మందుబాబులకు పిఠాపురం స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది. పిఠాపురం రూరల్, గొల్లప్రోలు, యు.కొత్తపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో మంగళవారం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. పిఠాపురం మండలం నర్సింగపురం రోడ్డులో రూరల్ ఎస్సై ఎస్‌ఎస్‌కే జాన్‌బాషా తనిఖీలు చేపట్టారు. ఇందులో పది మందిని బుధవారం కోర్టులో హాజరు పరిచగా, ఇద్దరికి ఐదు రోజుల చొప్పున సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ బొమ్మిడి విజయభారతి శిక్ష విధించారు. మిగిలిన ఎనిమిది మందికి రూ.10 వేల చొప్పున జరిమానా వేశారు.
ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడులు
తొండంగి: ప్రకృతి వ్యవసాయం ద్వారా అధిక దిగుబడులతో పాటు నాణ్యమైన ఉత్పత్తులు పొందవచ్చని ఏపీ సీఎన్‌ఎఫ్ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ జె.ఎలియాజర్, మండల వ్యవసాయశాఖ అధికారి ఎంఎంవీఎస్ పద్మశ్రీ అన్నారు. బెండపూడిి గ్రామ రైతు సేవా కేంద్రంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేయడం ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. అంతేకాకుండా ఎంతో ఆరోగ్యకరమైన పంట ఉత్పత్తులను పొందవచ్చన్నారు. రసాయన ఎరువులు వాడకుండా ఘన జీవామృతం, బీజామృతం వంటి వాటిని తయారు చేసి వినియోగించడం ద్వారా తెగుళ్ల నివారణకు దోహదం చేస్తుందన్నారు. ప్రస్తుతం రబీ వరి పంట కోతలు కోస్తున్న నేపథ్యంలో రైతులు పచ్చి రొట్ట విత్తనాలను (పీఎండీఎస్) వేయాలన్నారు. ఈ పైరు సాగు చేయడం ద్వారా భూమిలో సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా పెరుగుతాయని తెలిపారు. వేసవిలో భూమి వేడి తగ్గి వచ్చే ఖరీఫ్ పంట సాగుకు మేలు జరుగుతుందని అన్నారు. ఎల్ నినో ప్రభావంతో రైతులు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల సహాయ వ్యవసాయ అధికారి మాదన సతీష్‌వర్మ, గ్రామ సచివాలయాల అగ్రికల్చర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు


