టిడ్కో రుణాలు రద్దు చేయండి | - | Sakshi
Sakshi News home page

టిడ్కో రుణాలు రద్దు చేయండి

Apr 22 2026 7:18 AM | Updated on Apr 22 2026 7:18 AM

పాడైన ఇళ్లకు

వెంటనే మరమ్మతులు చేయాలి

మున్సిపల్‌ కార్యాలయం వద్ద లబ్ధిదారుల ధర్నా

సామర్లకోట: టిడ్కో ఇళ్ల నిర్మాణానికి ఇచ్చిన బ్యాంకు రుణాలను వెంటనే రద్దు చేయాలనే డిమాండుతో సీపీఎం ఆధ్వర్యాన లబ్ధిదారులు మంగళవారం మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం కమిషనర్‌ ఎ.శ్రీవిద్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ, పాడైపోయిన టిడ్కో ఇళ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్‌ చేశారు. పైభాగంలో ఉన్న వారి వాడకపు నీరు కింద నివాసం ఉంటున్న వారిపై పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైన్లు శుభ్రం చేయడం లేదని, తుప్పలు పెరిగిపోయాయని వాపోయారు. జగ్గమ్మగారిపేటలో జీ+1 ఇళ్లు నిర్మిస్తామని చెప్పిన గత టీడీపీ ప్రభుత్వం జీ+3 ఇళ్లు నిర్మించి మోసం చేసిందని ఉప్పువారి సత్రం, జగ్గమ్మగారిపేటల్లోని లబ్ధిదారులు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో ఫ్లాటు ధర రూ.7 లక్షలుగా నిర్ణయించారన్నారు. దీనిలో కేంద్రం రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.1.50 లక్షల చొప్పున సబ్సిడీ ఇవ్వగా, మిగిలిన రూ.4 లక్షల్లో రూ.లక్ష లబ్ధిదారు వాటా పేర్కొన్నారు. మిగిలిన రూ.3 లక్షలకు బ్యాంకు నుంచి రుణాలు అందజేశారని చెప్పారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి నాయకులు తమ ఇళ్లకు వచ్చి బ్యాంకు రుణాలు రద్దు చేస్తామంటూ హామీ ఇచ్చారన్నారు.

కానీ, నెలకు రూ.4 వేల చొప్పున 20 సంవత్సరాల పాటు రుణ వాయిదాలు చెల్లించాలంటూ బ్యాంకు అధికారులు డిమాండ్‌ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పు చెల్లించకపోతే ఇంటిని స్వాధీనం చేసుకుంటామంటూ హెచ్చరిస్తున్నారని వాపోయారు.

సీపీఎం పట్టణ కార్యదర్శి బాలం శ్రీనివాస్‌ మాట్లాడుతూ, ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాల్సిన ఇళ్లకు రూ.3 లక్షల రుణమని చెప్పి, చివరకు రూ.10 లక్షలకు మించి వసూలు చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా సంఘాల సభ్యులకు వచ్చిన రుణాలను, మిగిలిన లబ్ధిదారులకు వస్తున్న ప్రభుత్వ పథకాల సొమ్మును బ్యాంకు అధికారులు అప్పుల కింద జమ చేసుకుంటున్నారని చెప్పారు. టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాల్లో ఎవ్వరికీ ఏ బ్యాంకులూ రుణాలివ్వడం లేదని, ఇదెక్కడి దారుణమని కమిషనర్‌ను ప్రశ్నించారు. రూ.500 చెల్లించిన వారికి ఉచితంగా ఇచ్చినట్టుగానే రూ.50 వేలు, రూ.లక్ష చెల్లించిన వారికి ఇళ్లను స్వాధీనం చేయాలని పలువురు లబ్ధిదారులు ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. టిడ్కో ఇళ్లు ఉచితంగా ఇస్తారనే ఆశతో చంద్రబాబుకు ఓట్లు వేశామని, కానీ ఆయన వలన తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.లక్ష చెల్లించి పదేళ్లు కావడంతో వడ్డీగా రూ.4 లక్షల వరకూ చెల్లించామని వాపోయారు. టిడ్కో ఇళ్లకు మరమ్మతులు చేయిస్తామని, పారిశుధ్య పనులు జరిగేలా చూస్తామని కమిషనర్‌ హామీ ఇచ్చారు, బ్యాంకు రుణాల రద్దు ప్రభుత్వ పరిధిలోనిదని చెప్పారు. టిడ్కో కమిటీలో తాను కూడా సభ్యురాలిని కావడంతో రుణాల వసూలుకు బ్యాంకు అధికారులు తమపై ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకు వెళ్లాలని మహిళలు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు కరణం ఏడుకొండలు,, బాలం సత్తిబాబు, కె.తులసీదాసు, బాలం హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement