ఉపాధ్యాయ సమస్యలపై ధర్నా | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయ సమస్యలపై ధర్నా

Apr 22 2026 7:18 AM | Updated on Apr 22 2026 7:18 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చిండాడ ప్రదీప్‌కుమార్‌, బి.నూకరాజు డిమాండ్‌ చేశారు. యూనియన్‌ ఆధ్వర్యాన ఉపాధ్యాయులు కలెక్టరేట్‌ వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. అనంతరం, కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌కు నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉపాధ్యాయులకు సర్వీస్‌ రూల్స్‌ రూపొందించాలన్నారు. నూతన పీఆర్‌సీ వేసి, 30 శాతం మధ్యంతర భృతి మంజూరు చేయాలని కోరారు. సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని, మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఉపాధ్యాయులకు జీపీఎఫ్‌ ఖాతాల ఏర్పాటుతో పాటు స్కూల్‌ కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులను గ్రేడ్‌–1గా మార్చాలని, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్లను, ప్రతి ఉన్నత పాఠశాలలో డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించాలని, ఐదేళ్లకోసారి మాత్రమే ఉపాధ్యాయుల రేషనలైజేషన్‌ చేపట్టాలని, జిల్లా పరిషత్‌ ఉపాధ్యాయుల కారుణ్య నియామకాలను కలెక్టర్‌ పరిధిలో చేపట్టాలని, ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు టెట్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. పీఆర్‌టీయూ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పెడల ఏడుకొండలు, సభ్యులు సీహెచ్‌ శ్రీనివాస్‌, ఏజీవీ సుబ్బారావు, ఎం.శివయ్య పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లోతృతీయ స్థానం

నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ సిటీ): చిత్తూరులో ఇటీవల జరిగిన అంతర్‌ జిల్లాల హాకీ పోటీల్లో జిల్లా మహిళా జట్టు తృతీయ స్థానం సాధించింది. హాకీ సంఘ ప్రతినిధి వి.రవిరాజు మంగళవారం ఈ విషయం తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్‌ఏ) హాకీ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్‌డీఓ) వి.సతీష్‌ కుమార్‌ మాట్లాడుతూ, క్రీడల్లో రాణించేవారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు. కాకినాడ క్రీడా మైదానంలో తర్ఫీదు పొందుతున్న జట్టు రాష్ట్ర స్థాయిలో తృతీయ స్థానం సాధించడం అభినందనీయమని అన్నారు. జట్టుకు కోచ్‌గా రవిరాజు, మేనేజర్‌గా పి.నందిని, కెప్టెన్‌గా సాయి బంగారు వ్యవహరించారు.

సాధారణ సీనియారిటీ తాత్కాలిక జాబితా విడుదల

ప్రకాశం నగర్‌ (రాజమహేంద్రవరం): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా విద్యా శాఖ పరిధిలో ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్ల కింద పని చేస్తున్న సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్లు, ప్రధానోపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబితాను ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ (టీఐఎస్‌) ఆధారంగా విడుదల చేశారు. తూర్పు గోదావరి డీఈఓ కంది వాసుదేవరావు మంగళవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఈ జాబితాలు డీఈఓఈజీ.ఓఆర్‌జీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు. ఈ జాబితాపై అభ్యంతరాలను ఈ నెల 25లోగా కాకినాడలోని జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement