పారిశుధ్య సిబ్బందికి వేతనాల చెల్లింపు | - | Sakshi
Sakshi News home page

పారిశుధ్య సిబ్బందికి వేతనాల చెల్లింపు

Apr 22 2026 7:18 AM | Updated on Apr 22 2026 7:18 AM

అన్నవరం: వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం పారిశుధ్య సిబ్బందికి వేతనాల చెల్లింపు ప్రక్రియ మొదలైంది. దేవస్థానంలో పారిశుధ్యం, హౌస్‌ కీపింగ్‌, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ కాంట్రాక్ట్‌ నిర్వహిస్తున్న పద్మావతి సంస్థలో 413 మంది వివిధచోట్ల పని చేస్తున్నారు. ఏప్రిల్‌లో మూడు వారాలు పూర్తయినా వీరికి గత ఫిబ్రవరి, మార్చి నెల వేతనాలు చెల్లించలేదు. వారి ఇబ్బందులపై ‘సత్యదేవా సాపాట్లు కనవా!’ శీర్షికన ఈ నెల 11న ‘సాక్షి’ కథనం ప్రచురించింది. ఈ నెల 12న అన్నవరం దేవస్థానానికి వచ్చిన దేవదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, దేవదాయ శాఖ కమిషనర్‌ కె.రామచంద్ర మోహన్‌ దృష్టికి ఈ విషయం రావడంతో వెంటనే వేతనాలు చెల్లించాలని వారు ఆదేశించారు. ఇది జరిగి వారం రోజులైనా వేతనాలు చెల్లించకపోవడంతో ‘వేతన యాతన ఎన్నాళ్లు..? శీర్షికన ఈ నెల 19న ‘సాక్షి’ మరో కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో అధికారులు ఆరా తీయగా ఫిబ్రవరి నెల వేతనాల బిల్లును దేవస్థానం చెల్లించినప్పటికీ సిబ్బందికి కాంట్రాక్టర్‌ జీతాలు ఇవ్వని విషయం వెల్లడైంది. దీంతో, దేవస్థానం అధికారులు శానిటేషన్‌ కాంట్రాక్టర్‌పై ఒత్తిడి తెచ్చి, కెనరా బ్యాంక్‌లో అకౌంట్‌ కలిగిన సిబ్బందికి ఫిబ్రవరి నెల వేతనాలు చెల్లించారు. మిగిలిన బ్యాంకుల్లో అకౌంట్లు కలిగిన సిబ్బందికి కూడా ఒకటి రెండు రోజుల్లో చెల్లించనున్నారు. మార్చి నెల వేతనాల బిల్లును కూడా ఒకటి రెండు రోజుల్లో కాంట్రాక్టర్‌కు చెల్లిస్తామని అధికారులు తెలిపారు. సిబ్బందికి చెల్లించాల్సిన వేతనాల బిల్లును పద్మావతి సంస్థ 15వ తేదీ తరువాత మాత్రమే అందిస్తోందని, దీనివలన చెల్లింపులు ఆలస్యమవుతున్నాయని పేర్కొన్నారు. పారిశుధ్య సిబ్బందికి ఇకపై ప్రతి నెలా సకాలంలో వేతనాలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని, కాంట్రాక్ట్‌ సంస్థ కూడా ప్రతి నెలా ఐదో తేదీ లోగా దేవస్థానానికి బిల్లు అందించాలని దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement