పని పడుతున్నారు | - | Sakshi
Sakshi News home page

పని పడుతున్నారు

Apr 21 2026 3:56 AM | Updated on Apr 21 2026 3:56 AM

విరవాడ చెరువులో ఉపాధి పనులు చేస్తున్న కూలీలు

ఉపాధి కూలీలకు సాంకేతిక చిక్కులు

ఐరిస్‌ నమోదుకు గంటల

తరబడి నిరీక్షణ

సగం మందికి దొరకని పని

పస్తులుంటున్న కుటుంబాలు

పిఠాపురం: కడుపు నింపుకోవడానికి రెక్కలు ముక్కలు చేసుకుంటున్న ఉపాధి కూలీలకు ప్రభుత్వ నిర్ణయాలు, నిబంధనలు శాపంగా మారుతున్నాయి. చాలా సంవత్సరాలుగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరిట అమలు చేస్తున్న పథకం పేరును కేంద్ర ప్రభుత్వం వికసిత్‌ భారత్‌ – గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ అజీవికా మిషన్‌ (గ్రామీణ్‌) (వీబీజీ రామ్‌జీ)గా మార్చింది. గత మార్చి 7 నుంచి ఈ పథకంలో కొత్తగా నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టం (ఎన్‌ఎంఎంఎస్‌) తీసుకుని వచ్చింది. దీనివలన ఇటు ఉపాధి కూలీలకు, అటు సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. వీబీజీ రామ్‌జీ పథకం కింద మరిన్ని పనిదినాలు కల్పించాల్సి ఉంది. కానీ, సాంకేతిక సమస్యలతో ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఫలితంగా క్షేత్ర స్థాయిలో పనులు కల్పించే అవకాశం ఉండడం లేదు. గత ఏడాది ఇదే సమయంలో దాదాపు 50 వేల మంది పైగా ఉపాధి హామీ పనులకు వెళ్లేవారు. ప్రస్తుతం 50 శాతం మందికి మాత్రమే పనులు దొరుకుతున్న పరిస్థితి నెలకొంది. పని ప్రదేశానికి వెళ్లి, హాజరు వేసుకునేంత వరకూ ఉపాధి పని ఉంటుందో లేదో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. గంపెడాశతో కిలోమీటర్ల మేర నడిచి వెళ్లిన వారికి సాంకేతిక సమస్యలు గుదిబండగా మారుతున్నాయి.

గంటల తరబడి నిరీక్షణ

పని జరుగుతున్న ప్రదేశంలో భువన్‌ యాప్‌ ద్వారా జియో ట్యాగింగ్‌ చేస్తున్నారు. అక్కడి నుంచి మాత్రమే ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌ (ఎఫ్‌ఆర్‌ఎస్‌) యాప్‌ ద్వారా ఉపాధి కూలీల హాజరు నమోదు చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో సిబ్బంది ఏ చెరువును ఎక్కడి నుంచి ట్యాగ్‌ చేశారో అక్కడ మాత్రమే హాజరు నమోదవుతోంది తప్ప, పని జరుగుతున్న చెరువు ప్రాంగణంలో నమోదు కావడం లేదు. దీంతో, అనేక మంది కూలీలు గంటల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి నెలకొంటోంది. మండుటెండల్లో మధ్యాహ్నం వరకూ కూడా వారికి నిరీక్షణ తప్పడం లేదు. మరోవైపు యాప్‌లో కూలీ ఫొటో మళ్లీ మళ్లీ తీయాలని చూపిస్తోంది. సర్వర్‌ సక్రమంగా పని చేస్తే 2 నిమిషాల్లో అవ్వాల్సిన నమోదు ప్రక్రియ ఒక్కోసారి 10 నిమిషాల వరకూ కూడా పడుతోంది. దీంతో, వందల మంది కూలీలకు ఫేస్‌ యాప్‌ ద్వారా హాజరు నమోదు చేయాలంటే గంటల తరబడి సమయం వెచ్చించాల్సి వస్తోంది. పని పని ప్రదేశానికి వచ్చిన వెంటనే వ్యక్తిగతంగా ఫేస్‌ యాప్‌ ద్వారా హాజరు నమోదు చేస్తూండగా.. తిరిగి వెళ్లేటప్పుడు గ్రూప్‌ ఫొటో తీయాలి. పలువురు కూలీలకు ఆధార్‌ బయోమెట్రిక్‌ పూర్తి కాకపోవడంతో ఫేస్‌ ఆథరైజేషన్‌ (ముఖ ధ్రువీకరణ) లేక తరచూ కే–100 ఎర్రర్‌ వస్తోంది. ఆధార్‌ బేస్డ్‌ ఈ–కేవైసీ మస్టర్‌ నమోదు వలన అనేక మందికి ఈ–కేవైసీ పూర్తి కాలేదు. పూర్తయిన వారి వివరాలను కూడా ఎన్‌ఎంఎంఎస్‌ సర్వర్‌లో లోపాల వలన యాప్‌లో చూపించడం లేదు. ఫలితంగా అనేక మంది కూలీలకు పని లేకుండా పోతోంది.

తగ్గిపోతున్న కూలీలు

యాప్‌ ద్వారా హాజరు నమోదులో ఇబ్బందులతో అనేక మంది కూలీలకు పని లేకుండా పోతోంది. దీంతో, జిల్లావ్యాప్తంగా ఉపాధి కూలీల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. పని దొరుకుతుందనే ఆశతో కిలోమీటర్ల దూరం నడిచి వెళ్తున్నారు. తీరా వెళ్లాక పని ప్రదేశంలో హాజరు నమోదు కాకపోవడంతో నిరాశగా వెనుతిరుగుతున్నారు. ఫలితంగా ఈ పథకంపై ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్న వేలాది మంది అర్ధాకలితో పస్తులుండాల్సి వస్తోంది. అంత దూరం వెళ్లిన తరువాత పని దొరుకుతుందో లేదోననే అనుమానంతో అనేక మంది ఈ పథకంపై ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పనులు చేస్తున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. మరోవైపు వారాల తరబడి వేతనాలు సైతం అందడం లేదు. గత 10 వారాలు పైనే వేతనాలు తమ ఖాతాల్లో జమ కావడం లేదని, దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు ఉపాధి కూలీలు వాపోతున్నారు.

ఐరిస్‌ పడటం లేదని

పని ఇవ్వడం లేదు

గతంలో కంటి ఆపరేషన్‌ జరిగింది. ఉపాధి హామీ పనికి వెళితే కంటి ద్వారా హాజరు వేస్తున్నారు. కంటి ఆపరేషన్‌ కారణంగా నాకు హాజరు పడటం లేదు. హాజరు పడటం లేదు కాబట్టి పనికి రావద్దని చెబుతున్నారు. గత 20 రోజులుగా ప్రతి రోజూ ఉపాధి హామీ పనికి వెళ్తున్నా పని ఇవ్వడం లేదు. ఐరిస్‌ విధానం నాలాంటి వారికి ఇబ్బందికరంగా ఉంది. గతంలో ఫొటో లేదా వేలిముద్ర ద్వారా హాజరు వేసి, పని కల్పించేవారు. ఇప్పుడు కూడా అదేవిధంగా పని కల్పించాలని కోరుతున్నాను.

– దిబ్బిడి సూర్యనారాయణ, ఉపాధి కూలీ, విరవాడ, పిఠాపురం మండలం

జిల్లాలో ఉపాధి కూలీల వివరాలు

ఉపాధి పనులు జరిగే మండలాలు 20

పనులు జరిగే గ్రామాలు 267

జాబ్‌ కార్డులు 2,29,000

వేతనదారులు 2,03,000

ప్రతి రోజూ పని చేసే వారు 1,46,000

ఈ ఏడాది ‘ఉపాధి’ పొందుతున్న వారు 25,000

రోజువారీ సగటు వేతనం రూ.281.79

Advertisement
 
Advertisement
Advertisement