మార్గం సుగమం | - | Sakshi
Sakshi News home page

మార్గం సుగమం

Apr 21 2026 3:56 AM | Updated on Apr 21 2026 3:56 AM

భారత్‌మాల రోడ్డు నిర్మాణానికి

తొలగిన అడ్డంకులు

అన్నవరం రైతులకు పరిహారం చెల్లింపు

వాకలపూడి నుంచి

ప్రారంభమైన పనులు

అన్నవరం: కాకినాడ సమీపంలోని వాకలపూడి లైట్‌హౌస్‌ నుంచి అన్నవరం వరకూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన భారత్‌మాల పరియోజన ఫేజ్‌–1 రోడ్డు (ఎన్‌హెచ్‌–516ఎఫ్‌) నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. అన్నవరంలో సేకరించిన భూమి పరిహారం విషయంలో ఏర్పడిన ప్రతిష్టంభన తొలగిపోవడంతో ఈ రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమమైంది.

2020లో గ్రీన్‌ సిగ్నల్‌

సాగర తీరం వెంబడి పారిశ్రామికాభివృద్ధి కోసం వాకలపూడి లైట్‌ హౌస్‌ నుంచి అన్నవరం వరకూ 40.621 కిలోమీటర్ల పొడవున నాలుగు వరుసల రోడ్డు నిర్మాణానికి 2020లో అప్పటి ఎన్‌డీఏ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రూ.1,040 కోట్ల వ్యయంతో ఈ రోడ్డు నిర్మాణానికి 2021లో ఒకసారి టెండర్‌ నోటిఫికేషన్‌ ఇచ్చి రద్దు చేశారు. తిరిగి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) గత ఏడాది జూలైలో టెండర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అప్పట్లో అరవిందో రియాల్టీ కంపెనీ టెండర్‌ లోయెస్ట్‌గా వచ్చింది. కొన్ని సాంకేతిక కారణాలతో ఆ టెండర్‌ను రద్దు చేసి, గత ఏడాది ఆగస్టులో మరోసారి టెండర్‌ పిలిచారు. ఆ దఫా 9 సంస్ధలు టెండర్లు దాఖలు చేశాయి. వాటిలో అతి తక్కువకు కోట్‌ చేసిన సంస్థకు ఈ రోడ్డు నిర్మాణ కాంట్రాక్ట్‌ అప్పగించారు.

రైతుల ఆందోళన

ఈ రోడ్డు నిర్మాణానికి అన్నవరం గ్రామ పంచాయతీ పరిధిలో ఆరెంపూడి, అన్నవరం గ్రామాలకు చెందిన 20 ఎకరాల భూమిని ఎన్‌హెచ్‌ఏఐ సేకరించింది. అన్నవరంలో 16వ నంబర్‌ జాతీయ రహదారిని ఆనుకుని ఎకరం భూమి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకూ పలుకుతోంది. అయితే, 2022లో ఆరెంపూడి గ్రామ రైతులు 20 మందికి పదెకరాలకు ఎకరానికి రూ.కోటి చొప్పున ఎన్‌హెచ్‌ఏఐ పరిహారం చెల్లించింది. ఆరెంపూడి, అన్నవరం గ్రామాల రైతులకు హైవే పక్కన ఒకేచోట భూమి ఉంది. మధ్యలో గట్టు మాత్రమే అడ్డు. అయినప్పటికీ రికార్డుల్లో గ్రామం పేరు, సర్వే నంబర్లు మారాయనే సాకుతో అన్నవరం పరిధిలో మొత్తం పదెకరాలకు సంబంధించి సుమారు 20 మంది రైతులకు ఎటువంటి పరిహారమూ చెల్లించలేదు. దీనికోసం వారు 2022 నుంచి ఆందోళన చేస్తున్నారు. గత ఏడాది ఆగస్టులో టెండర్లు ఖరారవడంతో కలెక్టర్‌ను పలుమార్లు కలసి తమ పరిహారంపై విన్నవించారు. నిబంధనల ప్రకారమే పరిహారం చెల్లిస్తామని, పైసా పెంచేది లేదని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు అప్పట్లోనే చెప్పారు. అయితే, గ్రామంలో భూముల విలువ ఎక్కువగా ఉన్నందున పరిహారం పెంచాల్సిందేనని రైతులు పట్టుబట్టారు. దీనిపై ఎన్‌హెచ్‌ఏఐ ఏమీ తేల్చకపోవడంతో పునరాలోచనలో పడిన అన్నవరం రైతులు ఆలస్యమయ్యేకొద్దీ తమకే నష్టమని భావించారు. దీంతో, గతంలో ఇస్తామన్న పరిహారం ఇప్పించాలని, ఆలస్యమైనందుకు ఆ మేరకు న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు గతంలో చెప్పిన విధంగా ఎకరాకు రూ.కోటి పరిహారం, దానిపై 9 శాతం వడ్డీ లెక్కించి ఎన్‌హెచ్‌ఏఐ రైతులకు చెక్కులు అందజేసింది.

నష్టపోయాం

పరిహారం విషయంలో అన్యాయం జరిగింది. మా భూమి 2.5 ఎకరాలు సేకరించారు. ఆరెంపూడి పరిధిలో మా కుటుంబ సభ్యుల భూమి రెండెకరాలు తీసుకున్నారు. వారికి ఎకరానికి రూ.కోటి చొప్పున 2023లోనే చెల్లించారు. మా భూమి అన్నవరం పరిధిలో ఉండటంతో పరిహారం ఇవ్వలేదు. ఆలస్యమైనందున రెట్టింపు పరిహారం ఇవ్వాలని కోరాం. మూడేళ్లయినా పట్టించుకోలేదు. విధి లేని పరిస్థితుల్లో గతంలో ఇస్తానన్న పరిహారమైనా ఇప్పించాలని, ఆలస్యమైనందుకు న్యాయం చేయాలని కోరాం. కేవలం 9 శాతం వడ్డీతో పరిహారం ఇచ్చారు. గతంలో పరిహారం పొందిన వారు మరోచోట భూములు కొనుక్కొని లాభపడ్డారు. మేం నష్టపోయాం.

– బండారు ముత్యాలరావు, రైతు, అన్నవరం

Advertisement
 
Advertisement
Advertisement