కాకినాడ రూరల్: సర్పవరం సీఐ బొక్కా పెద్దిరాజును పోలీసు ఉన్నతాధికారులు వీఆర్(వేకెన్సీ రిజర్వ్)కు పంపించారు. పరిపాలనా పరమైన కారణాలతో ఆయనను వీఆర్‌కు పంపిస్తున్నట్లు పేర్కొన్నారని సమాచారం. ఆయన స్థానంలో కాకినాడ దిశా పోలీసు స్టేషన్ సీఐ రవికుమార్ సర్పవరం ఇన్‌చార్జి సీఐగా సోమవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. పెద్దిరాజుకు ఇంకా రెండేళ్ల సర్వీసు ఉండగా వీఆర్‌కు పంపడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
వ్యక్తి మృతిపై ఆందోళన
కాకినాడ క్రైం: వ్యక్తి మృతిపై కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగిన ఘటన సోమవారం కాకినాడలో చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. తుని మండలం వెలమ కొత్తూరుకు చెందిన ఫైనాన్స్ వ్యాపారి తారేపల్లి నాగేశ్వరరావు(60)కు నాగేశ్వరరావుకు ఆయాసం వస్తూండటంతో ఉదయం 10 గంటలకు గూగుల్ రివ్యూల ఆధారంగా భానుగుడి సెంటర్‌లోని ఓ క్లినిక్‌కు తీసుకు వెళ్లారు. బాధితుడిని అక్కడి వైద్యులు ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై ఓ స్కానింగ్ సెంటర్‌కు పంపారని మృతుడి మేనకోడలు సత్యదేవి తెలిపింది. అసలే ఆయాసంతో ఉన్న నాగేశ్వరరావును స్కానింగ్ సెంటర్‌లోని సిబ్బంది మెట్ల మార్గంలో రెండంతస్తులు ఎక్కించారని, స్కానింగ్ పూర్తి చేసి, కిందికి వచ్చేసరికి అతడు పూర్తి అచేతన స్థితికి చేరుకున్నాడని చెప్పింది. అక్కడి నుంచి మళ్లీ ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యుడు స్థానిక ఫౌండేషన్ ఆస్పత్రికి రిఫర్ చేశాడని, అక్కడికి చేరేసరికే నాగేశ్వరరావు ప్రాణం పోయిందని సత్యదేవి తెలిపింది. స్కానింగ్‌కు తీసుకువెళ్లి నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తమ ఇంటి పెద్దను కోల్పోయామని వైద్యులు, సిబ్బందిపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడవ చేసి కేసు పెట్టాలని చూస్తే పోస్ట్‌మార్టం చేయాల్సి వస్తుందంటూ బెదిరించారని, దీంతో, భయపడి విరమించి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించామని చెప్పారు.
పీజీఆర్‌ఎస్‌కు 368 అర్జీలు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు 368 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ హరేందిర ప్రసాద్‌తో పాటు వివిధ శాఖల అధికారులు అర్జీలు స్వీకరించారు.
చాంబర్ ఆఫ్ కామర్స్
జిల్లా చైర్మన్‌గా రమేష్
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఏపీ ఫెడరేషన్ ఆఫ్ చాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా చైర్మన్‌గా డేగల రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నగరంలోని ఓ హోటల్‌లో ఆదివారం జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు వక్కలగడ్డ భాస్కరరావు, స్టేట్ కో ఆర్డినేటర్ గ్రంధి బాబ్జీ సమక్షంలో రమేష్‌తో పాటు జిల్లా కార్యదర్శిగా గుర్రం సత్యనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా సుతాపల్లి పద్మరాజు, కొమ్మిశెట్టి కుమార్, రత్నగీతార్థలు నియామక పత్రాలు అందుకున్నారు.


