● పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు
కూలీల పయనం
● జిల్లాలో కుదేలైన ఇటుకల పరిశ్రమ
● ఉత్పత్తి లేక అమాంతం పెరిగిన ధర
● అదే స్థాయిలో
ముడిసరకు ధరలకు రెక్కలు
● నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం
ఆలమూరు: వలస కూలీల మీదే ఆధారపడిన ఇటుక పరిశ్రమ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరితో భవన నిర్మాణ రంగం కుదేలైంది. అయినప్పటికీ స్థానిక పరిస్థితుల ప్రభావంతో ఇటుక ధర మాత్రం క్రమేపీ పెరుగుతోంది. సరిగ్గా ఇదే తరుణంలో మరోవైపు ముడిసరకు ధరలు కూడా అమాంతంగా పెరిగిపోతున్నాయి. దీంతో, ఆశించిన మేర గిట్టుబాటు ధర లభించడం లేదని బట్టీ యజమానులు గగ్గోలు పెడుతున్నారు. నెల రోజుల క్రితం ఒక్కో ఇటుక ఖరీదు రూ.4.50 వరకూ ఉండగా ప్రస్తుతం రూ 8.50కు పెరిగింది.
పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు పయనం
ఇక్కడి ఇటుక బట్టీల్లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన కూలీలు పెద్ద సంఖ్యలో పని చేస్తున్నారు. ఈ నెల 23, 29 తేదీల్లో ఆ రాష్ట్ర శాసన సభకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇక్కడి బెంగాలీ కూలీలు దశల వారీగా వెళ్లిపోతున్నారు. వేసవి పూర్తయితేనే కానీ వారు తిరిగి వచ్చే పరిస్థితి లేదు. ఫలితంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇటుక ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో, కొరత ఏర్పడి, ఇటుక ధర దాదాపు రెట్టింపు పెరిగింది. చిన్న తరహా బట్టీల యజమానులు తమ వద్ద ఉన్న ఇటుకను ఆర్థిక లావాదేవీల కోసం పూర్తిగా విక్రయించుకున్నారు. కానీ, కొంతమంది కార్పొరేట్ స్థాయి బట్టీ యజమానుల దగ్గర మాత్రం ఇటుక పుష్కలంగా ఉంది. ఒకవైపు డిమాండుకు తగినట్టు ఉత్పత్తి లేకపోగా.. మరోవైపు ఉన్న నిల్వలు ఒకే వర్గం వద్ద పోగుపడిపోతున్నాయి. ఇదే అదనుగా వారు కృత్రిమ కొరత సృష్టించి, ధర పెంచుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇదే పరిస్థితి నెలల తరబడి కొనసాగితే జిల్లాలో మూడు వంతుల బట్టీలు మూసివేయక తప్పదని యజమానులు అంటున్నారు. దీనికి తోడు పులి మీద పుట్రలా ముడిసరకు ధరలను కూడా వ్యాపారులు ఇష్టానుసారం పెంచేస్తున్నారని వాపోతున్నారు.
ఆ కూలీలు వస్తేనే
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా సుమారు 2 వేల ఇటుక బట్టీలున్నాయి. వీటిలో ఒక్క కోనసీమ జిల్లాలోనే దాదాపు 800 బట్టీలున్నాయి. జిల్లాలోని బట్టీల్లో పని చేస్తున్న సుమారు 25 వేల మంది కార్మికుల్లో 70 శాతం మంది బెంగాలీ కూలీలే. మరో 20 శాతం ఒడిశా, బీహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందినవారున్నారు. పది శాతం మాత్రమే స్థానిక కూలీలు పని చేస్తున్నారు. ఈ బట్టీల ద్వారా జిల్లాలో ఇప్పటి వరకూ దాదాపు 20 లక్షల వరకూ ఇటుక ఉత్పత్తి అవుతూండగా.. బెంగాలీ కూలీలు లేకపోవడంతో అది ఏకంగా 5 లక్షలకు పడిపోయింది. ఇటీవల తెలంగాణ లోని ఖమ్మం జిల్లాకు స్థానిక ఇటుక ఎగుమతులు అధికంగా ఉండం కూడా ధరల పెరుగుదలకు కారణమైంది. ఇటుక ఉత్పత్తికి సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం.. కూలీల మీదనే ఆధారపడటం కూడా ఒక్కోసారి ఇటుక పరిశ్రమ సంక్షోభానికి కారణమవుతోంది.
ముడి సరకు గత ధర (రూ.) కొత్త ధర (రూ.)
నల్లమట్టి ట్రాక్టర్) 1,500 2,500
బొండు ఇసుక (లారీ) 7,500 11,500
ఊక (టన్ను) 3,500 4,000
బూడిద (టన్ను) 1,000 1,800
పుల్లలు (టన్ను) 1,800 3,200
పెరిగిన ముడి సరకు ధరలు
ఇటుక ధరలు ఆశాజనకంగా ఉన్నాయని భావిస్తున్న తరుణంలో ముడిసరకు ధరలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. గత ఏడాది ధరలతో పోలిస్తే ప్రస్తుతం 50 నుంచి 150 శాతం వరకూ ముడిసరకు ధరలు పెరిగిపోయాయి. అలాగే, బెంగాలీ కార్మికుల కొరతతో పరిశ్రమలో పోటీతత్వం పెరిగి కూలీలకు చెల్లించే ధర కూడా అమాంతం పెరిగిపోయింది. దీంతో, వెయ్యి ఇటుక తయారీకి సుమారు రూ.5 వేల వరకూ ఖర్చవుతోంది. గతంలో ఇటుక తయారీకి కూలీలకు సగటున రూ.900 వరకూ ఖర్చవుతూండగా ప్రస్తుతం అది రూ.1,400కు పెరిగింది. గతంలో ప్రదేశాన్ని, సానుకూలతను బట్టి ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకూ ఉన్న లీజు ధర ప్రస్తుతం రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ పలుకుతోంది.


