ఏలేశ్వరం: వేసవి ఎండలు తీవ్రతతో ఏలేరు జలాశయంలో నీటి నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. ఎగువ నుంచి వస్తున్న నీరు అంతంత మాత్రంగానే ఉంటోంది. దీంతో, ఆయకట్టుకు నీటి సరఫరాను తగ్గించారు. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 86.56 మీటర్లు కాగా ఆదివారం 77.07 మీటర్లుగా నమోదైంది. పూర్తి స్థాయి సామర్థ్యం 24.11 టీఎంసీలకు గాను 10.27 టీఎంసీల మేర మాత్రమే నీటి నిల్వలున్నాయి. ఆయకట్టుకు 150, విశాఖపట్నానికి 225, పంపా జలాశయానికి 50 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. తిమ్మరాజు చెరువుకు నీటి సరఫరా నిలిపివేశారు.
తలుపులమ్మ సన్నిధిలో
భక్తుల రద్దీ
తుని రూరల్: లోవ దేవస్థానంలో వెలసిన తలుపులమ్మ అమ్మవారి సన్నిధికి ఆదివారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో వచ్చిన సుమారు 25 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.2,02,680, పూజా టికెట్లకు రూ.2,65,540, కేశఖండన శాలకు రూ.15,520, వాహన పూజలకు రూ.7,890, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.71,730, విరాళాలు రూ.43,929 కలిపి మొత్తం రూ.6,07,289 ఆదాయం సమకూరిందని వివరించారు.
రేపు పీఆర్‌టీయూ ధర్నా
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద మంగళవారం ధర్నా నిర్వహిస్తున్నట్లు పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు చింతాడ ప్రదీప్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ ఏర్పాటు, డీవైఈఓ, ఎంఈఓ, జూనియర్ లెక్చరర్, పీజీటీల పదోన్నతులు కల్పించాలని, 2023 జూలై 1 నుంచి 12వ పీఆర్‌సీ అమలు చేయాలని, 30 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని, ఇంకా ఇతర సమస్యల పరిష్కారానికి ఈ ధర్నా నిర్వహిస్తున్నామని వివరించారు.
నర్సరీలో మొక్కల నరికివేత
కడియం: మండలంలోని దామిరెడ్డిపల్లిలో సుమారు రూ.6 లక్షల విలువైన నర్సరీ మొక్కలను గుర్తు తెలియని దుండగులు నరికేశారు. గ్రామంలోని పోలేరమ్మ గుడి సమీపాన ఏడు కుంచాల చేనులో బాధితుడు, ఆ గ్రామ ఎంపీటీసీ సభ్యుడు విత్తనాల సాయికుమార్ కౌలు వ్యవసాయం చేస్తున్నారు. అందులో మిర్చి మేరీ గ్రీన్, పోక రకాలకు చెందిన 25 అంగుళాల బ్యాగు సైజు మొక్కలు పెంచుతున్నారు. ఈ నెల 13వ తేదీ రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆ నర్సరీలోకి చొరబడి మొక్కల మొవ్వులను నరికేశారు. మొత్తం మొక్కలన్నిటినీ ఇదే విధంగా చేయడంతో తనను నష్టపరచడానికి ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని సాయికుమార్ గ్రహించారు. దీనిపై కడియం పోలీసులకు ఈ నెల 14న ఫిర్యాదు చేశారు. ఈ వివరాలను ఆయన ఆదివారం స్థానిక విలేకర్లకు వెల్లడించారు. తనకు ఎవ్వరితోనూ వివాదాలు లేవని, తనను ఇంతగా నష్టపరచాల్సిన అవసరం ఎవరికి వచ్చిందో అర్థం కావడం లేదని సాయికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మొవ్వులు నరికేసిన మొక్కలు తిరిగి కోలుకోవని చెప్పారు.


