వసూల్‌ రాజా! | - | Sakshi
Sakshi News home page

వసూల్‌ రాజా!

Apr 19 2026 7:47 AM | Updated on Apr 19 2026 7:47 AM

సాక్షి ప్రతినిధి, కాకినాడ: రేషన్‌ కార్డుదారులకు ఉచితంగా పంపిణీ చేస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) బియ్యం విదేశాలకు తరలిపోతోందనే బూచిని చూపిస్తూ కూటమి నేతలు వసూళ్ల దందాకు బరి తెగిస్తున్నారు. దీనికోసం వ్యూహాత్మకంగా ఆకస్మిక తనిఖీల పేరుతో ఆర్భాటం చేసి వ్యాపార వర్గాలను భయకంపితులను చేస్తున్నారు. ఒకటి రెండు రోజులు తనిఖీలతో హడలెత్తించి, చివరిలో ‘పైసల ఫార్ములా’తో డీల్‌కు సై అంటున్నారు. కాకినాడ పోర్టు కేంద్రంగా సాగుతున్న ఈ వ్యవహారం అటు అధికారులు, ఇటు వ్యాపార వర్గాల్లో కలకలం రేపుతోంది.

పీడీఎస్‌ బియ్యం ఎగుమతులు

లేకపోయినా..

వాస్తవానికి చంద్రబాబు సారథ్యంలో టీడీపీ ప్రభుత్వం గద్దెనెక్కాక కాకినాడ పోర్టులో ఎగుమతులు మందగించాయి. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణే కాకినాడ పోర్టులో ‘సీజ్‌ ద షిప్‌’ అంటూ స్వయంగా చేసిన హడావుడి ప్రభావం పోర్టుపై పడింది. ఈ క్రమంలో ఎక్స్‌పోర్టర్లు కాకినాడ పోర్టు నుంచి ఎగుమతులు తగ్గించుకుని, ప్రత్యామ్నాయంగా విశాఖపట్నం, నెల్లూరు, కాండ్లా పోర్టుల వైపు మళ్లించారు. ఫలితంగా కాకినాడ పోర్టులో ఎగుమతులు సగానికి సగం పడిపోయాయని సమాచారం. ఈవిధంగా వ్యాపార వర్గాలు ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న తరుణంలో.. పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా పేరిట కాకినాడకు చెందిన అధికార కూటమి నేత ఒకరు స్థానిక పోర్టులో ఆకస్మిక తనిఖీల పేరిట హడావుడి చేశారు. వాస్తవానికి కాకినాడ పోర్టు నుంచి బాయిల్డ్‌ రైస్‌ మాత్రమే ఎగుమతి అవుతోంది. పీడీఎస్‌లో బాయిల్డ్‌ రైస్‌ అనే మాటే ఉత్పన్నం కాదు. అటువంటప్పుడు కాకినాడ నుంచి పీడీఎస్‌ బియ్యం రవాణాకు ఆస్కారమే లేదని వ్యాపార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయం జిల్లా అధికార యంత్రాంగానికి కూడా తెలియనిది కాదని వ్యాపారులు అంటున్నారు. అయినప్పటికీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌తో సాన్నిహిత్యం, కూటమిలో రాష్ట్ర స్థాయి ప్రోటోకాల్‌ కలిగిన ఓ నాయకుడు అధికార దర్పంతో ఇటీవల హడావుడి చేశారు. దీనిపై అధికారులు సైతం కిమ్మనకుండా మిన్నకుండిపోయారు.

పెద్ద స్కెచ్చే..

ఇంత హడావుడి చేసిన ఆ నాయకుడు రెండు రోజుల్లోనే మధ్యవర్తుల ద్వారా రాజీ ఫార్ములా తెర మీదకు తీసుకువచ్చారు. పార్టీ సభ్యత్వాల కోసం తాను రూ.15 లక్షల పైగానే సొంత సొమ్ము ఖర్చు పెట్టానని ఆ నేత చెప్పుకుంటున్నారు. ఈ మొత్తాన్ని ఏదో ఒక విధంగా తిరిగి రాబట్టుకోవడానికి ఆయన పెద్ద స్కెచ్చే వేశారు. పోర్టులో ఆకస్మిక తనిఖీల పేరుతో వ్యాపారులను భయపెడితే వారి నుంచి పార్టీ సభ్యత్వానికి వెచ్చించిన సొమ్ము తిరిగి రాబట్టుకోవచ్చని భావించారు. ఈ నేపథ్యంలోనే ఆ నాయకుడు పోర్టులో హడావుడి చేశారని, ఆ తర్వాత రూ.15 లక్షల కోసం మధ్యవర్తుల ద్వారా ప్రతిపాదించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆకస్మిక తనిఖీలు చేస్తేనే నయానా భయానో తనకు గుర్తింపు ఉంటుందని, లేదంటే పదవి ఉన్నా అలంకారప్రాయంగానే మిగులుతుందని అన్నట్టు చెబుతున్నారు.

కుదరని బేరం

అయితే, రూ.15 లక్షల ప్రతిపాదనతో కంగు తిన్న వ్యాపారుల్లో కొందరు అంత మొత్తం ఇచ్చుకోలేమని తెగేసి చెప్పినట్లు తెలిసింది. మధ్యేమార్గంగా రూ.9 లక్షలు ముట్టజెప్పేందుకు ముందుకొచ్చారని, అంతకు మించి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేమని వారు చెప్పినట్లు తెలియవచ్చింది. అయితే, ముందుగా అనుకున్న మొత్తం ముట్టజెప్పాల్సిందేనని, పార్టీ సభ్యత్వాల కోసం వదిలిపోయిన చేతిచమురు ఈ డీల్‌ ద్వారా తిరిగి రావాల్సిందేనని అధికారులకు ఆ నాయకుడు గట్టిగానే చెప్పారని అంటున్నారు. పార్టీ సభ్యత్వాల సొమ్ము తిరిగి రాబట్టుకునేందుకు తమను బలి చేయడమేమిటని, మునుపెన్నడూ ఈవిధంగా ఒత్తిళ్లు తెచ్చిన దాఖలాలు లేవని వ్యాపారులు మండిపడుతున్నారు. ఆ నాయకుడు ఇలానే మొండిపట్టు పడితే పోర్టులో లావాదేవీలు నిలిపివేసే విషయంపై ఒక నిర్ణయానికి రావాలనే అభిప్రాయానికి చాంబర్‌ ప్రతినిధులు వచ్చినట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజులు వేచి చూసి, ఆపై ఓ నిర్ణయం తీసుకోవాలని వారు భావిస్తున్నట్లు సమాచారం. జనసేన అధినేత ‘సీజ్‌ ద షిప్‌’ అని అంటే అనుచరగణం మాత్రం రేటు, డీల్‌ అంటున్నారంటూ అధికార పార్టీ నేతలే నివ్వెరపోతున్నారు. అటు తిరిగి ఇటు తిరిగి ఈ వ్యవహారం చివరకు ఏ తీరానికి చేరుతుందో వేచి చూడాల్సిందే.

హాట్‌ టాపిక్‌గా

కూటమి నేత వ్యవహార శైలి

పీడీఎస్‌ బియ్యం అక్రమాలంటూ

పోర్టులో హడావుడి

ఆకస్మిక తనిఖీల పేరిట

వసూళ్లకు బరితెగింపు

పార్టీ సభ్యత్వ రుసుం

రాబట్టుకునే ఎత్తుగడ

రూ.15 లక్షలు ఇవ్వాలంటూ బేరాలు

మండిపడుతున్న వ్యాపారులు

Advertisement
 
Advertisement
Advertisement