ఉపాధ్యాయ సమస్యలు వెంటనే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయ సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Apr 19 2026 7:47 AM | Updated on Apr 19 2026 7:47 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీ టీచర్స్‌ ఫెడరేషన్‌ (ఏపీటీఎఫ్‌) జిల్లా అధ్యక్షుడు డీఏ రాజశేఖర్‌ డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌ వద్ద శనివారం నిర్వహించిన ధ ర్నాలో ఆయన మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్న 12వ పీఆర్‌సీ కమిషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని, 30 శాతం ఐఆర్‌ ప్రకటించాలని, జాప్యం లేకుండా పెండింగ్‌ డీఏలు విడుదల చేయాలని, బకాయిల చెల్లింపులో జాప్యాన్ని నివారించాలని, ఉపాధ్యాయుల వర్క్‌ లోడ్‌ వారానికి గరిష్టంగా 32 పీరియడ్స్‌ ఉండేలా చర్యలు చేపట్టాలని, ఆంగ్లంతో పాటు తెలుగు మాధ్యమాన్ని కూడా సమాంతరంగా కొనసాగించాలని, మున్సిపల్‌, కార్పొరేషన్లలో పెరిగిన జనాభాకు అనుగుణంగా కొత్త పాఠశాలలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఏపీటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ఇన్‌ సర్వీస్‌ టెట్‌ రద్దు చేయాలని, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలని, అసంపూర్తిగా ఉన్న పాఠశాలల తరగతి గదులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. ధర్నా అనంతరం డీఆర్‌ఓ తిప్పేనాయక్‌కు వినతిపత్రం సమర్పించారు.

స్పీకర్‌ రఘురామ హద్దులు మీరుతున్నారు

అధికార యంత్రాంగం ఆయనకు దాసోహం

మాజీ ఎంపీ హర్షకుమార్‌ ధ్వజం

జగ్గంపేట: ఆకివీడు క్రైస్తవుల విషయంలో రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారని, అఽధికార యంత్రాంగం ఆయనకు వత్తాసు పలుకుతోందని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగ్గంపేట నుంచి ఆకివీడు వెళ్లేందుకు శుక్రవారం బయలుదేరి పోలీసుల నిర్బంధానికి గురైన క్రైస్తవులను ఆయన శనివారం జగ్గంపేటలో కలసి సంఘీభావం తెలిపారు. వైఎస్సార్‌ సీపీ క్రిస్టిరయన్‌ మైనార్టీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.జాన్‌వెస్లీ ఆధ్వర్యాన క్రైస్తవులతో జరిగిన సమావేశంలో పాల్గొన్న అనంతరం హర్షకుమార్‌ విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రఘురామకు మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రార్థనలు చేసేందుకు ఆకివీడు వెళ్తుండగా వారిని పోలీసులు నిర్బంధించడం దారుణమన్నారు. ఆకివీడులో తనకు విశేష అధికారాలున్నట్టు రఘురామ హద్దు మీరి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అక్కడి సమస్యను అయోధ్య రామాలయమంత సమస్యలా చిత్రిస్తూ, అక్కడి క్రైస్తవులను భయపెడుతున్నారని అన్నారు. వాస్తవాలను గుర్తించకుంటే అధికారులే బాధ్యులవుతారని హెచ్చరించారు. క్రైస్తవుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హర్షకుమార్‌ ధ్వజమెత్తారు.

Advertisement
 
Advertisement
Advertisement