వేతన యాతన ఎన్నాళ్లు? | - | Sakshi
Sakshi News home page

వేతన యాతన ఎన్నాళ్లు?

Apr 19 2026 7:47 AM | Updated on Apr 19 2026 7:47 AM

రత్నగిరిపై పారిశుధ్య సిబ్బంది అవస్థలు

మంత్రి ఆనం, కలెక్టర్‌, ఆ శాఖ కమిషనర్‌

ఆదేశాలు సైతం బేఖాతరు

అన్నవరం: రత్నగిరిపై పారిశుధ్య కార్మికుల వేతన వెతలు ఇంకా కొలిక్కి రాలేదు. పద్మావతి సంస్థ కాంట్రాక్టు నిర్వహణ పనిచేస్తున్న 413 మందికి ఫిబ్రవరి, మార్చి నెలల వేతనాలు నేటికీ పడకపోవడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఈ సమస్యపై ఈ నెల 11వ తేదీన ‘సత్యదేవా సాపాట్లు కనవా’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఆ తరువాతి రోజు దేవస్థానానికి వచ్చిన దేవదాయ, ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆ కథనంపై స్పందించారు. వారికి సత్వరం వేతనాలు ఇవ్వాలని ఆదేశించారు. అలాగే, కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ సైతం సిబ్బంది వేతనాలపై ఆరా తీశారు. ఇది జరిగి ఐదు రోజులైనా ఆలయ అధికారుల్లో స్పందన లేదు. ఈ పరిస్థితుల్లో ఆ సిబ్బంది తమ కుటుంబ పోషణకు నానా అవస్థలూ పడుతున్నారు. శానిటరీ సంస్థ ఖర్చులన్నీ పోను సిబ్బందికి చెల్లించాల్సింది నెలకు రూ.50 లక్షలు. రెండు నెలలకు కలిపి రూ.కోటి చెల్లించాలి. ఈ వేతన బకాయిలు సత్వరం చెల్లించాలని మంత్రి సమక్షంలోనే దేవదాయ శాఖ కమిషనర్‌ రామచంద్ర మోహన్‌ స్వయంగా ఆదేశించినా అధికారుల్లో చలనం లేకపోవడం గమనార్హం.

సిబ్బంది సంఖ్యపై సందిగ్ధం

అసలు పద్మావతి సంస్థ కింద దేవస్థానంలో 413 మంది పని చేస్తున్నారా? ఎక్కడ ఎంత మంది పని చేస్తున్నారన్న వివరాలు సరిగా లేవన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ విషయమై ఆడిట్‌ అధికారులను ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. కాగా దేవస్థానంలో కేవలం 350 మంది మాత్రమే పని చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపైనా అధికారులు ఆరా తీయాల్సి ఉంది.

సీఎంకు సన్నిహితుడని చర్యలకు వెనుకంజ

దేవస్థానంలో శానిటరీ పనులు దక్కించుకున్న పద్మావతి సంస్థ అధిపత భాస్కర నాయుడు సీఎం చంద్రబాబుకు సన్నిహితుడనే విషయం తెలిసిందే. ఈ కారణంగానే కొండపై పారిశుధ్య నిర్వహణ బాగోకపోయినా, సకాలంలో వేతనాలు చెల్లించకపోయినా ఎవరూ ఆయనను ప్రశ్నించలేకపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement