రత్నగిరిపై భక్తుల రద్దీ | - | Sakshi
Sakshi News home page

రత్నగిరిపై భక్తుల రద్దీ

Apr 19 2026 7:47 AM | Updated on Apr 19 2026 7:47 AM

అన్నవరం: వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి శనివారం కిటకిటలాడింది. సత్యదేవుని సన్నిధికి రాష్ట్రం నలుమూలల నుంచీ భక్తులు తరలి రావడంతో ఉదయం నుంచి రాత్రి వరకూ కూడా రద్దీ కొనసాగింది. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సత్యదేవుని వ్రతాలు 1,500 జరిగాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. సర్కులర్‌ మండపం వద్ద సుమారు 5 వేల మంది భక్తులకు పులిహోర, దధ్యోదనం పంపిణీ చేశారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. రత్నగిరిపై ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగనుంది. సుమారు 40 వేల మంది భక్తులు వస్తారనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

తొలి తిరుపతి కిటకిట

సామర్లకోట: తొలి తిరుపతిగా ప్రసిద్ధికెక్కిన పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత శృంగార వల్లభ స్వామి ఆలయం ఽశనివారం వేలాది మంది భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక వాహనాలతో పాటు కాలి నడకన పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయాన్ని పూలమాలలతో విశేషంగా అలంకరించి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి తెల్లవారుజామున ఇచ్చిన తొలి హారతిని దర్శించడానికి భక్తులు పోటీ పడ్డారు. అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు పూజాదికాలు నిర్వహించారు. సుమారు 15 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.1,63,500, అన్నదాన విరాళాలు రూ.65,516, కేశఖండన ద్వారా రూ.5,520, లడ్డూ ప్రసాదం విక్రయాల ద్వారా రూ.20,235, ఇతరత్రా కలిపి రూ.2,54,871 ఆదాయం వచ్చిందని వివరించారు. సుమారు 2,500 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారన్నారు. వేసవి నేపథ్యంలో ఆలయం వద్ద మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఆలయం వద్ద వాహనాల పార్కింగ్‌కు పంచాయతీ ఆశీలు వసూలు చేయడం సర్వత్రా విమర్శలకు దారి తీసింది.

Advertisement
 
Advertisement
Advertisement