చోరీ కేసుల్లో ఐదుగురి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

చోరీ కేసుల్లో ఐదుగురి అరెస్టు

Apr 19 2026 7:47 AM | Updated on Apr 19 2026 7:47 AM

భారీ మొత్తంలో బంగారు, వెండి ఆభరణాల స్వాధీనం

కాకినాడ క్రైం: ఇళ్ల తాళాలు పగులగొట్టి సొత్తు దోచుకుంటున్న ముగ్గురిని, నకిలీ తాళాలతో బైక్‌ చోరీలు చేసే ఇద్దరిని జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ బిందుమాధవ్‌ ఈ వివరాలు వెల్లడించారు. కాకినాడ ఏటిమొగకు చెందిన 32 ఏళ్ల రేకాడి వెంకటేశ్వర్లు నగరంతో పాటు శ్రీకాకుళంలో 30కి పైగా దొంగతనాలు చేశాడు. అతడి నుంచి 117 గ్రాముల బంగారు, 629 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.1.95 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అతడిని కోరంగి ఎస్సై సత్యనారాయణ ఆధ్వర్యంలో అరెస్టు చేశారు. అతడికి సహకరించిన ఇద్దరు మైనర్లను వన్‌టౌన్‌, టూ టౌన్‌ పోలీసులు అరెస్టు చేసినట్టు ఎస్పీ తెలిపారు. స్థానిక జె.రామారావు పేటకు చెందిన వనమాడి జానకిరామ్‌, మాడుగుల మండలం సత్యవరం గ్రామానికి చెందిన రేఖా సతీష్‌లను సైతం అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ చోరీలో మరో నిందితుడు కాకినాడ ఘాటీ సెంటర్‌కు చెందిన తోట శివశంకర్‌ పరారీలో ఉన్నాడన్నారు. సామర్లకోట – కాకినాడ రహదారిలో సామర్లకోట సీఐ కృష్ణభగవాన్‌ బృందం ముద్దాయిలను పట్టుకుందని తెలిపారు. వీరి నుంచి రూ.5 లక్షల విలువైన ఆరు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఐదుగురిని అరెస్టు చేయడం ద్వారా కాకినాడ వన్‌ టౌన్‌, టూ టౌన్‌, కోరింగ, సామర్లకోట పోలీస్‌ స్టేషన్ల పరిధిలో జరిగిన 10 కేసులను ఛేదించి, సుమారు రూ.26 లక్షల సొత్తు రికవరీ చేసినట్టు ఎస్పీ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement