ఉద్యోగులను ప్రభుత్వం పట్టించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగులను ప్రభుత్వం పట్టించుకోవాలి

Apr 18 2026 7:29 AM | Updated on Apr 18 2026 7:29 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు బకాయిలు పూర్తిగా చెల్లిస్తామంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని చంద్రబాబు ప్రభుత్వం గాలిలో కలిపేసిందని వైఎస్సార్‌ సీపీ ఎంప్లాయీస్‌, పెన్షనర్స్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నల్లమర్రు చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. కాకినాడ వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో వైఎస్సార్‌ సీపీ ఎంప్లాయీస్‌, పెన్షనర్స్‌ విభాగం రీజనల్‌ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఉద్యోగులు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన బకాయిలు ఏటా కొండలా పేరుకుపోతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఈ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.30 వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం రూ.7,900 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. అవికూడా పూర్తి స్థాయిలో చెల్లించకుండా కాలయాపన చేస్తోందని చెప్పారు. పదవీ విరమణ ప్రయోజనాలు ఇవ్వకుండా అనేక ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులు ప్రయోజనాలు అందక వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు.

పెండింగ్‌ డీఏలు ఎప్పుడిస్తారు?

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు డీఏలు పెండింగ్‌ పెట్టిందని, అవి ఎప్పుడు ఇస్తుందో చెప్పాలని చంద్రశేఖర్‌ డిమాండ్‌ చేశారు. పెండింగ్‌ పెట్టిన డీఏలుకు ఈ ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుందా అని ప్రశ్నించారు. ప్రభుత్వం కార్పొరేట్‌ ఆసుపత్రులకు చెల్లించాల్సిన డబ్బు చెల్లించకపోవడంతో హెల్త్‌ కార్డులు నిరుపయోగంగా మారిపోయాయన్నారు. కొంత మంది లక్షలాది రూపాయలు చెల్లించి వైద్యం చేయించుకోలేక.. ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెలా ప్రభుత్వం మాత్రం హెల్త్‌కార్డులకు ఉద్యోగుల జీతాల నుంచి ప్రీమియం డబ్బు యథావిధిగా తీసుకుంటోందని చెప్పారు. గ్రామ సచివాలయ ఉద్యోగులతో వెట్టి చాకిరీ చేయించడం వల్ల సుమారు 250 మంది వరకు చనిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. పదవీ విరమణ చేసిన అధికారిని అదే శాఖలో అదే పోస్టులో ఉంచడం వల్ల చాలా మంది ఉద్యోగుల పదోన్నతులు నిలిచిపోతున్నాయన్నారు.

ఒకటో తేదీన ఎప్పుడైనా జీతం ఇచ్చావా..

ఉద్యోగులుకు, పెన్షనర్స్‌కు ఒకటో తేదీన జీతాలు ఇస్తానని చెప్పిన చంద్రబాబూ ఈ 22 నెలల్లో ఎవరికై నా ఒకటో తేదీన జీతం ఇచ్చావా అని నిలదీశారు. పేరివిజన్‌ కమిషన్‌ వేయాలని డిమాండ్‌ చేశారు. ఐఆర్‌, పీఆర్సీ ఇవ్వాలన్నారు. సీపీఎస్‌ రద్దు దిశగా ఒక్క సమావేశం కూడా నిర్వహించడ లేదన్నారు. అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు అమలు చేయాలన్నారు. పెన్షన్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని చెప్పినా ఆ ఊసే లేదన్నారు. గ్రామ సచివాలయాల ఉద్యోగులు పని ఒత్తిడి కారణంగా మరణిస్తున్నారన్నారు. జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవడమే లక్ష్యంగా అందరూ పనిచేయాలని కోరారు. వైఎస్సార్‌ సీపీ ఎంప్లాయీస్‌, పెన్షనర్స్‌ విభాగం రాష్ట్ర సెక్రటరీ శివారెడ్డి, జాయింట్‌ సెక్రటరీ చిలకమర్తి సాయి ప్రసాద్‌, ఉభయగోదావరి జిల్లాల కో ఆర్డినేటర్‌ లావణ్య పాల్గొన్నారు.

పేరుకు పోయిన

బకాయిలు తక్షణం చెల్లించాలి

వైఎస్సార్‌ సీపీ ఎంప్లాయీస్‌,

పెన్షనర్స్‌ విభాగం

రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement