సాక్షి ప్రతినిధి కాకినాడ: పిఠాపురం నియోజకవర్గంలో నిరుపేద కుటుంబాలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల భూములు అన్యాక్రాంతం చేయడానికి ఇచ్చన ఉత్తర్వులను వెంటనే నిలిపివేసి వారికి అన్యాయం జరగకుండా చూడాలని వైఎస్సార్ సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి వంగా గీత కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులతో కలసి కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్‌కు కలెక్టరేట్‌లో శుక్రవారం ఆమె వినతిపత్రం అందజేశారు. ఆమె మాట్లాడుతూ పిఠాపురం, పిఠాపురం రూరల్, గొల్లప్రోలు, గొల్లప్రోలు రూరల్, కొత్తపల్లి మండలాల్లో పేదలకు ఇళ్ల స్థలాల కోసం గత ప్రభుత్వం 400 ఎకరాలు భూమి కొనుగోలు చేసి సుమారు 10 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిందన్నారు. లబ్ధిదారులకు ఆయా పట్టా భూములు రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, ఇళ్ల నిర్మాణం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపించిందన్నారు. వాటిలో కొంతమంది ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్నారన్నారు. కొన్ని లే అవుట్లలో రోడ్లు, కరెంటు, నీరు లేక పోవడం వల్ల, ఎన్నికల కారణంగా గృహ నిర్మాణాలకు అనుమతులు రాక లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ఎదురు చూస్తున్నారన్నారు. ఇంతలో పిఠాపురం మసీదు మాన్యం లేఅవుట్‌లో సుమారు 250 మందికి కేటాయించిన భూమిలో కాలేజీ నిర్మాణానికి అనుమతిస్తూ వచ్చిన ఉత్తర్వులు పేద ల్లో ఆందోళన కలిగించాయన్నారు. పిఠాపురం మండలం నర్శింగపురంలో లేఅవుట్‌లో 1,000 మందికి కేటాయించిన భూమిలో ఒక పాఠశాల నిర్మాణం కోసం ఉత్తర్వులు వచ్చాయన్నారు. ఇప్పటికే కేటాయించిన భూములను పేదల అధీనంలోనే ఉంచాలని ఆమె కోరారు. లబ్ధిదారులకు గృహ నిర్మాణ అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. జెడ్పీటీసీ సభ్యుడు ఉలవకాయల నాగ లోవరాజు, వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు గండేపల్లి బాబీ, పచ్చిమళ్ల జ్యోతి, రావుల మాధవరావు, అడపా రఘు, ఆనాల సుదర్శన్, తలిశెట్టి వెంకటేశ్వరరావు, సోమరౌతు లలిత, పెదపాటి రాజేష్ పాల్గొన్నారు.
కలెక్టర్‌కు మాజీ ఎంపీ వంగా గీత వినతి


