లింగ వివక్షను రూపుమాపాలి | - | Sakshi
Sakshi News home page

లింగ వివక్షను రూపుమాపాలి

Apr 18 2026 7:29 AM | Updated on Apr 18 2026 7:29 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): లింగ వివక్షను రూపుమాపేందుకు ఏర్పాటైన చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేందిర ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం గర్భస్థ పిండ లింగ నిర్థారణ వెల్లడి నిషేధ చట్టం అమలుపై జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి వెయ్యికి మహిళల నిష్పత్తి జాతీయ స్థాయిలో 991, రాష్ట్రంలో 943 ఉండగా, జిల్లాలో 969 ఉందన్నారు. జిల్లా సగటు కంటే తక్కువ మహిళా జనాభా ఉన్న పీహెచ్‌సీల పరిధిలోని ప్రాంతాలపై దృష్టి సారించి, కారణాలను విశ్లేషించాలన్నారు. జిల్లాలో కొత్తగా రెండు ఆల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ సెంటర్ల రిజిస్ట్రేషన్‌కు, 8 స్కానింగ్‌ సెంటర్ల రిజిస్ట్రేషన్‌ రెన్యువల్‌కు అందిన దరఖాస్తులకు కమిటీ ఆమోదం తెలిపింది. స్కానింగ్‌ సెంటర్లలో మెషీన్లు, పేరు మార్పులు, మూసివేతకు అనుమతి కోరుతూ అందిన మరో 8 దరఖాస్తులను ఆమోదించింది.

భవన నిర్మాణ కార్మికులకు మరింత భరోసా

భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో కార్మికశాఖ కొన్ని సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకొచ్చినట్లు కలెక్టర్‌ ప్రకటనలో తెలిపారు. వివాహ కానుక కింద రూ.20 వేలు, కార్మికుని కుమార్తె, మహిళా కార్మికురాలి వివాహానికి అందిస్తారన్నారు. గరిష్టంగా ఇద్దరు కుమార్తెలకు ఇస్తారన్నారు. ప్రసూతి సాయంగా రూ.20 వేలు అందజేస్తారన్నారు. వివరాలకు 94925 55112 నంబర్‌లో సంప్రదించాలన్నారు.

మహిళలకు రుణాలివ్వాలి

మహిళలను పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించేందుకు మరిన్ని రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్‌ షణ్మోహన్‌ ఎం.ఎన్‌.హరేందిర ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. డీఆర్‌డీఏ, సెర్ప్‌, మెప్మా శాఖలలో అమలవుతున్న పలు అభివృద్ధి కార్యకలాపాలపై శుక్రవారం కలెక్టరేట్‌లో సమీక్షించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు మంజూరు చేస్తున్న రుణాలు, వాటి వినియోగం, రికవరీ పరిస్థితులపై అధికారులతో చర్చించారు. ప్రతి లబ్ధిదారునికి రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement