ఉప ముఖ్యమంత్రి ఇలాకాలో..మరో భూ సంతర్పణ | - | Sakshi
Sakshi News home page

ఉప ముఖ్యమంత్రి ఇలాకాలో..మరో భూ సంతర్పణ

Apr 17 2026 10:38 AM | Updated on Apr 17 2026 10:38 AM

సాక్షి ప్రతినిధి, కాకినాడ: పిఠాపురం మసీదు మాన్యంలో 245 మంది అర్హులైన నిరుపేదల ఇళ్ల నిర్మాణానికి కేటాయించిన భూములను.. ఆయుష్‌ వైద్య కళాశాల నిర్మాణం పేరుతో తిరిగి స్వాధీనం చేసుకునేందుకు.. చంద్రబాబు సర్కార్‌ ప్రత్యేక జీఓ విడుదల చేయడంపై ఇప్పటికే వివాదాస్పదంగా మారింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్‌ సీపీతో పాటు వామపక్షాలు ప్రత్యక్ష ఆందోళనకు కూడా ఉపక్రమించాయి. మరోవైపు కాకినాడలో స్టార్‌ హోటల్‌ నిర్మాణం కోసం ఆయుష్‌ ఆస్పత్రికి ఆనుకుని 4 ఎకరాలు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ కుటుంబానికి కట్టబెట్టడం కూడా వివాదాస్పదమైంది. ఈ భూములపై ఓవైపు ఆందోళనలు కొనసాగుతూండగానే.. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఇలాకా పిఠాపురంలో రాష్ట్ర ప్రభుత్వం మరో భూ సంతర్పణకు తెర తీసింది. పిఠాపురం మండలం నర్సింగపురంలో గత ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఇచ్చిన భూమిని.. ఓ విద్యా సంస్థకు కట్టబెట్టేందుకు చంద్రబాబు సర్కార్‌ ఉత్తర్వులు ఇచ్చింది. హైదరాబాద్‌కు చెందిన స్వామి నారాయణ గురుకుల ట్రస్టుకు ఏకంగా 20 ఎకరాలు ధారాదత్తం చేసేందుకు ప్రయత్నిస్తోంది. దీనిపై ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు.

నాడు పేదలకు కేటాయించిన జగన్‌ ప్రభుత్వం

నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసే సదుద్దేశంతో గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం నర్సింగపురంలో రైతుల నుంచి సుమారు 55 ఎకరాలు కొనుగోలు చేసింది. నర్సింగపురం రెవెన్యూ పరిధిలోని 211, 212, 213, 214, 215, 216, 217, 218 సర్వే నంబర్లలో ఈ భూమిని సేకరించారు. ఎకరాకు రూ.55 లక్షల చొప్పున రైతులకు చెల్లించారు. ఈ 55 ఎకరాల్లో పిఠాపురం పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని అన్ని సామాజిక వర్గాలకు చెందిన సుమారు 4 వేల మంది నిరుపేదల కోసం నాడు జగన్‌ సర్కార్‌ ఈ భూములను కొనుగోలు చేసింది. అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు చూపించి, పట్టాలు కూడా ఇచ్చింది. ఇళ్ల నిర్మాణాలు మొదలు పెట్టే సమయంలో సార్వత్రిక ఎన్నికలు రావడం, అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇక్కడ ఇళ్ల నిర్మాణాలు నెమ్మదించాయి.

పేదల భూములపై కన్ను

నర్సింగపురం భూముల్లో కొంత మంది పేదలు ఇళ్ల నిర్మాణాలు చేపడుతూండగా.. ఈ భూమిపై చంద్రబాబు సర్కారు కన్ను పడింది. అనుకున్నదే తడవుగా ఈ 55 ఎకరాల్లో సుమారు 20 ఎకరాలను హైదరాబాద్‌ స్వామి నారాయణ గురుకుల ట్రస్టు నిర్వహించే పాఠశాల నిర్మాణానికి కేటాయిస్తూ ఈ నెలలో జీఓ జారీ చేసింది. ఫలితంగా ఈ 20 ఎకరాల్లో ఇళ్ల పట్టాలు పొందిన సుమారు 1,000 మంది లబ్ధిదారుల సొంతింటి కల.. కలగానే మిగిలిపోయే పరిస్థితి దాపురించింది. నాడు జగన్‌ సర్కార్‌ పేదల కోసం కేటాయించిన దాదాపు రూ.11 కోట్ల విలువైన ఈ భూమిని ఒక ట్రస్టుకు ఎలా బదలాయిస్తారని లబ్ధిదారులు, స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పిఠాపురం మసీదు మాన్యంలో మాయ చేసినట్లుగానే ఇక్కడ కూడా భూమి ఖాళీగా ఉన్నట్లు రికార్డులు రూపొందించి, ఈ 20 ఎకరాలను ఆ ట్రస్టుకు కట్టబెట్టే ఎత్తుగడకు అధికార పార్టీ నేతలు తెర తీయడంపై మండిపడుతున్నారు. తమకు కేటాయించిన భూమిని ట్రస్టుకు ఎలా బదలాయిస్తారని లబ్ధిదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు కేటాయించిన భూములు తమకే ఇవ్వాలని, ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

నర్సింగపురంలో స్వామి నారాయణ గురుకుల ట్రస్టుకు కట్టబెడుతున్న పేదల భూములు

పేదల భూములే కనిపిస్తున్నాయా?

హోటళ్లు, కళాశాలలు, పాఠశాలలు నిర్మించాలంటే ఎన్నో భూములుంటాయి. కానీ, మాలాంటి పేదల ఇళ్ల స్థలాలకు ఇచ్చిన భూములే అధికారులకు కనిపిస్తున్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి ఇళ్ల స్థలం లేక ఇబ్బంది పడుతున్నాం. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో దళితులకు ఇళ్ల స్థలాలిచ్చారు. అలాంటి భూములను ఇప్పుడు వేరే నిర్మాణాలకు కేటాయించడం దారుణం. దళితులకు అన్యాయం జరిగితే వారి కుటుంబాలు వీధుల పాలవుతాయి. వారి సొంతింటి కలను నాశనం చేయాలని చూడొద్దు.

– దిమ్మల సత్తిబాబు, 30వ వార్డు, పిఠాపురం

వెంటనే ఇళ్లు నిర్మించాలి

నర్సింగపురంలో మాకు కేటాయించిన స్థలాల్లో వెంటనే ఇళ్ల నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలి. ఆ భూములను వేరొకరికి కట్టబెట్టాలని చూస్తే ఆందోళనకు దిగుతాం. మాకు అన్యాయం చేయకుండా, ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి. సొంతింటి కలను నిజం చేసుకోవాలని ఎదురు చూస్తూంటే.. ఉన్న స్థలాన్ని లాగేసుకోవాలని చూడటం దారుణం. ఇటువంటి చర్యలకు వెంటనే స్వస్తి చెప్పి, పేదలకు న్యాయం చేయాలి.

– బీరా నాగేశ్వరరావు, ఒకటో వార్డు, పిఠాపురం

పేదల పక్షాన పోరాటం

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీ కోసం లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలుగా కేటాయించిన నర్సింగపురం పేదల భూములను పాఠశాలకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తున్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్లు నిర్మించి ఇస్తామన్న చంద్రబాబు ప్రభుత్వం ఆ దిశగా ఎటువంటి చర్యలూ తీసుకోకపోగా.. ఇచ్చిన స్థలాలు లాక్కోవడానికి ప్రయత్నిస్తోంది. నర్సింగపురంలో పేదలకు వెంటనే ఇళ్లు నిర్మించాలి. లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకూ పోరాడతాం.

– వంగా గీత, వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, పిఠాపురం

ఈసారి నర్సింగపురం వంతు

స్వామి నారాయణ గురుకుల ట్రస్టుకు పేదల భూములు

20 ఎకరాలు కేటాయిస్తూ

ప్రభుత్వం ఉత్తర్వులు

విలువ సుమారు రూ.11 కోట్లు

రోడ్డున పడనున్న 1,000 మంది లబ్ధిదారులు

Advertisement
 
Advertisement
Advertisement