● వేట నిషేధ భృతికి మత్స్యకారుల ఎదురుచూపులు
● నేడు నమోదు ప్రక్రియ
● బోట్లు, మత్స్యకారుల గుర్తింపు
కాకినాడ రూరల్: మత్స్య సంపద పరిరక్షణే లక్ష్యంగా ఈ నెల 15 నుంచి జూన్ 14వ తేదీ వరకూ దాదాపు 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించిన విషయం తెలిసిందే. ఈ రెండు నెలలూ మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లతో సముద్రంలో చేపల వేటపై నిషేధం విధించారు. మత్స్య, ఇతర శాఖల అధికారుల పర్యవేక్షణలో నిషేధాజ్ఞలను అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదాయాన్ని కోల్పోతున్న మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ప్రభుత్వం రూ.20 వేల వేట నిషేధ భృతి ఇవ్వనుంది. ఈ మేరకు మైరెన్ ఫిషింగ్ బ్యాన్ రిలీఫ్‌కు సంబంధించిన మార్గదర్శకాలను మత్స్యశాఖ కమిషనర్ విడుదల చేశారు. దీనిని అనుసరించి జిల్లాలోని అన్ని ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల్లో బోటు ఓనర్ల సమక్షంలో వేట సాగించే మత్స్యకారుల నమోదును మత్స్యశాఖ అధికారులు పెద్ద ఎత్తున చేపట్టనున్నారు. ఈ క్రమంలో నిబంధనల సాకుతో వేట సాగించే వారి పేర్లు తొలగించకుండా అందరికీ ఆర్థిక సాయం అందించాలని మత్స్యకారులు కోరుతున్నారు.
ఎన్యూమరేషన్ ప్రక్రియ ఇలా..
ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల్లో నేడు
ఎన్యూమరేషన్.
ఏప్రిల్ 19 – 22 మధ్య డేటా పరిశీలించి, పోర్టల్‌లో నమోదు.
ఏప్రిల్ 23న సచివాలయాల్లో ప్రాథమిక జాబితా ప్రదర్శన.
ఏప్రిల్ 23 – 25 మధ్య అభ్యంతరాల స్వీకరణ.
ఏప్రిల్ 27న కలెక్టర్ తుది ఆమోదం.
ఏప్రిల్ 30 లేదా ప్రకటించిన తేదీన ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) విధానంలో వేట నిషేధ భృతి విడుదల.
ఇవీ అర్హతలు
ఎంఎస్ చట్టం–1958 కింద ఈ నెల 14వ తేదీ నాటికి బోటు రిజిస్టరై ఉండాలి.
వచ్చే జూన్ వరకూ చెల్లుబాటయ్యే ఫిషింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
బోట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఫిషింగ్ లైసెన్స్, క్రూ సభ్యుల ఆధార్, బ్యాంక్ పాస్ పుస్తకాల జిరాక్స్‌లు సమర్పించాలి.
వీరు అనర్హులు
2025–26లో ఏపీఎంఎఫ్‌ఆర్ చట్టం కింద పెనాల్టీ పడిన బోట్లకు ఈ సాయం ఇవ్వరు.
ఎన్టీఆర్ భరోసా (మత్స్యకార పెన్షన్) పొందుతున్న వారు అనర్హులు.
ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ చెల్లింపుదారులు, 4 చక్రాల వాహనం ఉన్నవారికి ఈ భృతి ఇవ్వ రు. దీనికి గాను ఆరంచెల తనిఖీ చేస్తారు.
బోట్ల వారీగా అనుమతించిన క్రూ (సభ్యుల) సంఖ్య
కేటగిరీ కొలత అనుమతించిన
సభ్యులు
మెకనైజ్డ్ బోటు 18 మీటర్ల పైన 10
మెకనైజ్డ్ బోటు 18 మీటర్ల లోపు 8
మోటారైజ్డ్ బోటు ––– 6
సంప్రదాయ బోట్లు ––– 3


