● ప్రభుత్వంపై మాజీ మంత్రి దాడిశెట్టి
రాజా విమర్శ
● ఆత్మగౌరవ దీక్షకు సంఘీభావం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): చేనేత కార్మికుల సమస్యలను చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేసిందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అన్నారు. కలెక్టరేట్ వద్ద చేనేత కార్మికులు చేస్తున్న ఆత్మగౌరవ దీక్షకు గురువారం ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కుటుంబ సభ్యులతో కలసి నేతన్నలు ఆత్మగౌరవ దీక్ష చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని, చర్చలకు పిలవడం లేదని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం నియంతలా వ్యవరిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతన్న నేస్తం పేరుతో చేనేత కార్మికుల ఖాతాల్లో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏటా డబ్బులు వేసేవారని, అటువంటిది ఈ ప్రభుత్వం రెండేళ్లుగా ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు ఇచ్చేందుకు 3 లక్షల దుప్పట్లకు ఆర్డర్ పెట్టిందని, ప్రస్తుతం అవి గోడౌన్‌లో ఉన్నాయని అన్నారు. చేనేత కార్మికులను అధికారులు కూడా పట్టించుకోవడం లేదని, వారి సమస్యలను తక్షణం పరిష్కరించాలని రాజా డిమాండ్ చేశారు. జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు మాట్లాడుతూ, నేతన్నలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, పావలా వడ్డీ, 30 శాతం మార్కెటింగ్ ఇన్సెంటివ్ వంటి పథకాలు పునరుద్ధరించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తి కుమార్, ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి, పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు పసుపులేటి వెంకటలక్ష్మి, ప్రచార విభాగం రాష్ట్ర కార్యదర్శి రావూరి వెంకటేశ్వరావు, రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి జమీలు, చేనేత సంఘం ప్రతినిధి ముప్పన వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.


