● 22 నుంచి నిత్యం నడవనున్న రైలు
● ప్రయాణికుల ఒత్తిడితో
సామర్లకోటలో హాల్ట్
సామర్లకోట: హైదరబాద్ వెళ్లే ప్రయాణికులకు ఇది శుభవార్తే. కాకినాడ టౌన్ – లింగంపల్లి స్టేషన్ల మధ్య ఇప్పటి వరకూ వారానికి మూడు రోజులు మాత్రమే నడుస్తున్న కోకనాడ ఎక్స్‌ప్రెస్ (12775/12776) ఇక నుంచి ప్రతి రోజూ అందుబాటులోకి రానుంది. సామర్లకోట రైల్వే స్టేషన్ మేనేజర్ ఎం.రమేష్ స్థానిక విలేకర్లకు గురువారం ఈ వివరాలు తెలిపారు. గతంలో కాకినాడ టౌన్ నుంచి మంగళ, గురు, ఆదివారాల్లో మాత్రమే ఈ రైలు లింగంపల్లి బయలుదేరేది. అలాగే, లింగంపల్లి నుంచి సోమ, బుధ, శుక్రవారాల్లో బయలుదేరేది. కీలక జంక్షన్ అయిన సామర్లకోటలో ఈ రైలుకు హాల్ట్ ఉండేది కాదు. ఈ రైలును ప్రతి రోజూ నడపాలని సామర్లకోటలో హాల్డ్ ఇవ్వాలని ఇక్కడి ప్రయాణికులు డివిజనల్ రైల్వే మేనేజర్‌తో పాటు ఇతర రైల్వే అధికారులు ఇక్కడకు వచ్చిన ప్రతిసారీ విజ్ఞాపనలు అందించేవారు. ఈ నేపథ్యంలో ఈ నెల 21 నుంచి ప్రతి రోజూ నడపాలని, సామర్లకోటలో హాల్ట్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నెల 21న ఈ రైలు లింగంపల్లిలో బయలుదేరి 22వ తేదీ ఉదయం 4.55 సామర్లకోట వస్తుందని రమేష్ తెలిపారు. అలాగే, కాకినాడలో 22వ తేదీ రాత్రి 8.15 గంటలకు బయలుదేరి సామర్లకోటకు 8.35కు చేరుకుని, 8.37 గంటలకు బయలుదేరుతుందని వివరించారు. కీలకమైన ఈ రైలుకు సామర్లకోటలో హాల్ట్ ఇవ్వడంతో పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం, తూర్పు గోదావరి జిల్లా రంగంపేట, బిక్కవోలు తదితర మండలాల ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది.


