తుని రూరల్: ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దేవత తలుపులమ్మ అమ్మవారి పుట్టింటి సంబరాలు గురువారం నుంచి జరగనున్నాయి. లోవ దేవస్థానం ఆధ్వర్యాన లోవ కొత్తూరులో జాగరణోత్సవాలు, తీర్థం, ఊరేగింపు నిర్వహించనున్నారు. అలాగే, పలు గ్రామాల్లో కూడా ఆయా గ్రామ కమిటీల ఆధ్వర్యాన గురువారం జాతరలు నిర్వహిస్తున్నారు. లోవ దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈఓ) పెన్మెత్స విశ్వనాథరాజు పర్యవేక్షణలో అధికారులతో పాటు ఆయా గ్రామ కమిటీలు ఈ ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేశాయి. గంధామావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని లోవ కొత్తూరులో 13 రోజుల పాటు అమ్మవారి పుట్టింటి సంబరాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ నెల ఐదో తేదీన అమ్మవారి గరగలను సంప్రదాయంగా పుట్టధార జలాలతో శుద్ధి చేశారు. ఉత్సవాల సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు ఈఓ తెలిపారు. లోవ కొత్తూరు, లోవ దేవస్థానం గాలి గోపురం, జగన్నాథగిరి వద్ద నమూనా ఆలయాన్ని విద్యుద్దీపాలతో విశేషంగా అలంకరించారు.
సంబరాలు జరుగుతాయిలా..
ఫ గురువారం నాడు లోవ దేవస్థానం నుంచి శక్తివేషాలు, కేరళ వాయిద్యాలు, కొమ్ము డ్యాన్సులు, చువ్వరాటాలు, మేళతాళాలతో ఊరేగింపుగా లోవ కొత్తూరు చేరుకుంటారు. రాత్రి ఒంటి గంట వరకూ గ్రామంలోని నాలుగు ఎకరాల అమ్మవారి ప్రాంగణంలో జాతర నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 గంటల నుంచి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తారు. రాత్రి 9 గంటల నుంచి నరసింహస్వామి నృత్యం, జాతర నృత్యరీతుల ప్రదర్శన, మణిపురి నృత్య ప్రదర్శన, ఇతర సంప్రదాయ నృత్యాలు, స్టేజ్ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.
ఫ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం గ్రామస్తులతో పౌరాణిక వేషధారణలు, బళ్లవేషాల ప్రదర్శనతో ఊరేగింపు నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు భరతనాట్యం, ఇతర నృత్యాలు ప్రదర్శిస్తారు. రాత్రి 9 గంటలకు ప్రముఖ గాయనీ గాయకులచే భక్తిరస సంగీత విభావరి, స్టేజ్ ప్రోగ్రాములు ఏర్పాటు చేశారు.
ఫ గంధామావాస్య సందర్భంగా మండలంలో వి.కొత్తూరు, సీతయ్యపేట, కొత్త వెలంపేట, రాజుపేట, తాళ్లూరు, మర్లపాడు, కుమ్మరిలోవ, కోళ్లఫారం కాలనీ, జగన్నాథగిరి, గెడ్లబీడు తదితర గ్రామాల్లో గురువారం తలుపులమ్మ అమ్మవారి జాతర వైభవంగా నిర్వహించనున్నారు. టీవీ కళాకారులచే సంగీత విభావరి, డ్యాన్స్ బేబీ డ్యాన్స్, నృత్య ప్రదర్శనలు, బళ్లవేషాలు, తీర్థాలు ఏర్పాటు చేశారు. గ్రామ దేవత కావడంతో ఇప్పటికే వివిధ పట్టణాలు, సుదూర ప్రాంతాల్లో ఉన్న బంధువులు, ఆడపడుచులు, అల్లుళ్లు ఆయా గ్రామాలకు తరలివచ్చారు.
ఫ నేడు జాగరణ
ఫ రేపు ఊరేగింపు, తీర్థం
ఫ లోవ దేవస్థానం
ఆధ్వర్యాన విస్తృత ఏర్పాట్లు
ఫ మరో 10 గ్రామాల్లో జాతరలు


