కాకినాడ రూరల్: ఏటిమొగలోని రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ(ఎస్‌ఐఎఫ్‌టీ)లో ఆక్వా కల్చర్‌లో సర్టిఫికేషన్ అండ్ ట్రేసబిలిటీ (మూలాలను గుర్తించే విధానం) ప్రాముఖ్యత అనే అంశంపై మూడు రోజుల రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు గురువారం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా అంతర్జాతీయ ఎగుమతి ప్రమాణాలపై రాష్ట్రవ్యాప్తంగా మత్స్యశాఖ అధికారులకు సాంకేతిక శిక్షణ అందిస్తున్నారు. శిక్షణ తరగతులను మత్స్యశాఖ కమిషనర్ రమా శంకర్ నాయక్ వర్చువల్‌గా ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని ఆక్వా చెరువుల నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఆక్వా పరిశ్రమ ప్రస్తుత స్థితిగతులను మత్స్యశాఖ అడిషనల్ డైరెక్టర్, ఎస్‌ఐఎఫ్‌టీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.అంజలి వివరించారు. ఆక్వా సాగు దీర్ఘకాలం నిలకడగా కొనసాగాలన్నా.. అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీ పడాలన్నా ప్రామాణిక సర్టిఫికేషన్ తప్పనిసరని అన్నారు. ఆలిండియా ష్రింప్ హేచరీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వై.రవికుమార్, ఈఐఏ అసిస్టెంట్ డైరెక్టర్ జోన్స్ వర్కీ తమ అనుభవాలను వివరించారు. మత్స్యశాఖ అధికారులు పి.కిరణ్‌కుమార్, దత్తాత్రేయ సమన్వయంతో శుక్రవారం శిక్షణ జరుగుతుంది.
నేడు నూతన
ఈఓ బాధ్యతల స్వీకరణ
అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి నూతన ఇన్‌చార్జి ఈఓగా పూర్తి అదనపు బాధ్యతలతో నియమితులైన వాడపల్లి దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం అన్నవరం దేవస్థానం ఇన్‌చార్జి ఈఓగా పని చేస్తున్న దేవదాయ శాఖ రాజమహేంద్రవరం రీజినల్ జాయింట్ కమిషనర్ వి.త్రినాథరావు ద్వారకా తిరుమల ఇన్‌చార్జి ఈఓగా బదిలీ అయిన విషయం తెలిసిందే. బాధ్యతల స్వీకరణ అనంతరం నూతన ఈఓ చక్రధరరావు సత్యదేవుని హుండీల ఆదాయం లెక్కింపును పర్యవేక్షించనున్నారు. సత్యదేవుని వార్షిక దివ్యకల్యాణ మహోత్సవాల ఏర్పాట్లపై సాయంత్రం జరిగే ప్రభుత్వ, దేవస్థానం అధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో కూడా పాల్గొంటారు.
జయలక్ష్మీ సొసైటీపై
నేడు విచారణ
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జయలక్ష్మీ సొసైటీలో జరిగిన అవినీతిపై సెక్షన్–29 విచారణ నివేదిక పైన, గంగిరెడ్డి త్రినాథరావు, 10 మంది డైరెక్టర్ల అవినీతి పైన గురువారం ఉదయం 11 గంటలకు సహకార అధికారులు విచారణ జరపనున్నారు. జయలక్ష్మీ విక్టిమ్స్ స్టీరింగ్ కమిటీ కార్యదర్శి ఈరంకి రఘుభూషణ్ బుధవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. సొసైటీలో జరిగిన రూ.4.6 కోట్ల నష్టాన్ని ఏవిధంగా రికవరీ చేయలనే విషయంపై సహకార శాఖ కమిషనర్ ఆదేశాలు మేరకు ఈ విచారణ చేస్తారని పేర్కొన్నారు.
సెజ్‌లో మెటలర్జికల్
కోక్ ప్లాంట్
సాక్షి ప్రతినిధి, కాకినాడ: చైన్నెకి చెందిన గ్రీన్ కోక్ – ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడ సెజ్ ఏరియాలో రూ.700 కోట్లతో భారీ మెటలర్జికల్ కోక్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. సంబంధిత అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై గ్రీన్ కోక్ – ఎనర్జీ ఎండీ నటరాజన్, కాకినాడ సెజ్ ఎండీ, సీఈఓ ఓజిలి రామ్‌రెడ్డి బుధవారం సంతకాలు చేశారు. సెజ్‌లో 80 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. ఉక్కు ఉత్పత్తిలో మెటలర్జికల్ కోక్‌ను కీలకంగా వినియోగిస్తారు. ఈ ప్లాంట్‌తో కాకినాడ జిల్లా తొండంగి, పిఠాపురం ప్రాంతాల్లో పారిశ్రామిక రంగం విస్తరించనుందని సెజ్ సీఈవో రామిరెడ్డి తెలిపారు. స్థానికంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభించనున్నాయన్నారు.
22న ‘నన్నయ’లో
20 వసంతాల వేడుక
రాజానగరం: ఆదికవి నన్నయ విశ్వ విద్యాలయం ఏర్పడి 20 సంవత్సరాలవుతున్న సందర్భంగా ఈ నెల 22న 20 రకాల థీమ్స్‌తో వర్సిటీలో ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ 20 థీమ్స్‌కి 20 మందిని కన్వీనర్లుగా నియమించారు. దీనికి సంబంధించిన బ్రోచర్‌ను నన్నయ వర్సిటీ ఉప కులపతి ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ బుధవారం విడుదల చేశారు.


