కిర్లంపూడి: అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పొలిటికల్ అడ్వజరీ కమిటీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం తెలిపారు. మంగళవారం కిర్లంపూడిలోని ఎస్సీపేటలో అంబేడ్కర్ విగ్రహం వద్ద దళిత పెద్దలు, గ్రామస్తులు, అంబేడ్కర్ యూత్ సభ్యులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం భారీ కేక్ కట్‌చేసి స్వీట్స్ పంచారు. ఆయనతో పాటు వైఎస్సార్ సీపీ ప్రత్తిపాడు కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు పాల్గొని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
మహోన్నత వ్యక్తి అంబేడ్కర్
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ప్రపంచ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని రూపొందించిన బీఆర్ అంబేడ్కర్ మహోన్నత వ్యక్తి అని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అన్నారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఆయన కాంస్య విగ్రహానికి మంగళవారం పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ అంబేడ్కర్ దేశానికి అందించిన సేవలను మన దైనందిన జీవితంలో గుర్తు చేసుకోవాలన్నారు. ప్రపంచ దేశాల్లో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గర్వంగా చెప్పుకుంటున్నాం అంటే కేవలం ఆయన చేసిన కృషి వల్లనే అని తెలిపారు. ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొన్నారు.
మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ
సభ్యుడు ముద్రగడ పద్మనాభం


