కాకినాడ లీగల్: ఈ నెల 24న కాకినాడ బార్ అసోసియేషన్‌కు 2026–27 సంవత్సరానికి ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఎన్నికల సీఈవో టీపీఆర్ చంద్రశేఖర్ మంగళవారం తెలిపారు. వివిధ పదవులు పోటీ చేయడానికి జాబితా విడుదల చేశారు. అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ, ఉపాధ్యక్షులు, సంయుక్త కార్యదర్మి, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ, లైబ్రరీ సెక్రటరీ, కోశాధికారి, మహిళా ప్రతినిధి, సూపర్ సీనియర్ కమిటి మెంబర్, సీనియర్ కమిటీ మెంబర్, మహిళా కమిటీ మెంబర్, కమిటీ మెంబర్స్, ఎగ్టిక్యూటివ్ మెంబర్లకు సీనియార్టీ ప్రకారం పోటీ చేసుకోవచ్చని ఎన్నికల అధికారి తెలిపారు. ఈ నెల 15,16,17 తేదీల్లో నామినేషన్లు స్వీకరిస్తామని చెప్పారు. ఈ ఎన్నికలకు 1,039 మంది ఓటు అర్హత కలిగి ఉన్నారన్నారు. ఈ నెల 24వ తేదీ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదేరోజు సాయంత్రం ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తామన్నారు.
నేడు ఇంటర్మీడియెట్
ఫలితాలు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంటర్మీడియెట్–26 ఫలితాలు బుధవారం అమరావతిలో విడుదల చేస్తున్నట్టు పీఆర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతుల రాంబాబు మంగళవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రథమ సంవత్సరం 20,120, ఒకేషనల్ 1,891 మంది, ద్వితీయ సంవత్సరం 19,442, ఒకేషనల్ పరీక్షలు 1,443 మంది రాశారని తెలియజేశారు. ఫలితాల విడుదల అనంతరం సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేస్తారని తెలిపారు.
హాస్టల్ విద్యార్థులకు
’దివీస్’ విరాళం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు కాకినాడ ఒంటిమామిడికి చెందిన దివీస్ ల్యాబ్‌రేటరీస్ లిమిటెడ్ సంస్థ రూ.3.10 కోట్ల విలువైన వస్తువులను విరాళంగా అందించినట్లు కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ తెలిపారు. మొదటి విడతగా 500 పరుపులను జిల్లాలో గల నాలుగు బీసీ హాస్టల్‌కు అందించేందుకు సిద్ధం చేసిన వాహనాన్ని మంగళవారం కలెక్టరేట్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న 8,500 మంది విద్యార్థులకు అవసరమైన వస్తువులను దివీస్ ల్యాబ్‌రేటరీస్ అందించడం అభినందనీయమన్నారు. పరుపులు, ఎల్‌ఈడి ట్యూబ్ లైట్లు, సీలింగ్ ఫ్యాన్లు, దోమతెరలు, ఆర్‌ఓ ప్లాంట్లు, ఇన్వర్టర్లను రూ.3.10 కోట్లతో సమకూర్చారన్నారు.
గృహోపకరణాల దగ్ధం
తాళ్లరేవు: కోరంగి పంచాయతీ సీతారామపురం గ్రామంలో మంగళవారం రాత్రి రెడ్డి నాగరాజు ఇంటిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఇంట్లోని వారంతా టీవీ చూస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో టీవీతో పాటు ఏసీ తదితర గృహోపకరణాలు కాలిపోయాయి. గమనించిన స్థానికులు వెంటనే మంటలను అదుపుచేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.


