ప్రస్తుతం వసంత రుతువు నడుస్తోంది. గ్రీష్మం ఇంకా రానేలేదు.. అప్పుడే కొద్ది రోజులుగా మార్తాండుడు ఆకాశ వీధి నుంచి అగ్నివర్షం కురిపిస్తున్నాడు. జిల్లాలోని కాకినాడ, పిఠాపురం, సామర్లకోట, పెద్దాపురం, తుని తదితర ప్రాంతాల్లో 36 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మండిపోతున్న ఎండలకు తోడు.. సముద్ర తీర ప్రాంతం కావడంతో తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడుతున్నారు. ఉదయం 10 గంటలు దాటితే చాలు.. సూర్యుడి ప్రతాపానికి తాళలేకపోతున్నారు. మధ్యాహ్నమైతే చాలు.. రోడ్లన్నీ దాదాపు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. తప్పనిసరిగా రాకపోకలు సాగిస్తున్న వారు నానా ఇక్కట్లూ పడుతున్నారు. కొబ్బరి బొండాలు, చెరకు రసాలు తాగుతూ, తాటిముంజెలు తింటూ పలువురు వేసవి తాపం నుంచి ఉపశమనం పొందుతున్నారు. వేసవి ఉష్ణోగ్రతలకు తట్టుకోలేక పలువురు కూలీలు జీవనోపాధికి సైతం దూరమవుతున్న దుస్థితి నెలకొంది. వేసవి తాపంతో డీహైడ్రేషన్‌కు గురై పలువురు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. మరోవైపు పట్టణాల్లోని పలు ప్రాంతాల్లో నిలువ నీడ లేక, తాగేందుకు గుక్కెడు నీరు దొరకక మూగజీవాలు సైతం అల్లాడిపోతున్నాయి. ఏప్రిల్ నెలలోనే పరిస్థితి ఇలా ఉంటే రానున్న నెలల్లో ఉష్ణోగ్రతలు ఏవిధంగా పెరుగుతాయోనని ఆందోళన చెందుతున్నారు.
– పిఠాపురం/కాకినాడ రూరల్


