ఆస్పత్రికి బయల్దేరి.. అనంత లోకాలకు.. | - | Sakshi
Sakshi News home page

ఆస్పత్రికి బయల్దేరి.. అనంత లోకాలకు..

Apr 14 2026 7:46 AM | Updated on Apr 14 2026 7:46 AM

డ్రైనేజీలో పడి తల్లీకొడుకుల మృతి

రాయుడుపాలెం సబ్‌ స్టేషన్‌ వద్ద ప్రమాదం

కాకినాడ రూరల్‌: అనారోగ్యంతో బాధ పడుతున్న తల్లికి చికిత్స చేయించాలనుకున్నాడు.. ఆమెను తీసుకుని మోటార్‌ సైకిల్‌పై బయలుదేరాడు.. అంతలోనే జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లితో సహా అనంత లోకాలకు పయనమైపోయాడు. కాకినాడ రూరల్‌ రమణయ్యపేట శివారు రాయుడుపాలెం జంక్షన్‌ సమీపాన తల్లీకొడుకులిద్దరూ దుర్మరణం పాలైన ఈ సంఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాలివీ.. పిఠాపురం మండలం చిత్రాడకు చెందిన దాసరి సత్యనారాయణ, లక్ష్మి (50) దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె. సత్యనారాయణ కొబ్బరి కాయల వ్యాపారం చేస్తూంటారు. కుమార్తెకు వివాహమైంది. కొద్ది రోజులుగా లక్ష్మి భుజం నొప్పితో బాధ పడుతోంది. ఈ నేపథ్యంలో ఆమెను కాకినాడలోని ఆస్పత్రిలో చూపించేందుకని చిన్న కుమారుడైన దుర్గా గణపతి (28) సోమవారం సాయంత్రం బైక్‌పై బయలుదేరాడు. రాయుడుపాలెం సబ్‌ స్టేషన్‌ వద్దకు వచ్చేసరికి వారి బైక్‌ అదుపు తప్పి, రోడ్డు పక్కనే 4 అడుగుల లోతున ఉన్న మురుగు నీటి డ్రైనేజీలోకి నేరుగా దూసుకుపోయింది. మురుగు నీటిలో బైక్‌తో సహా కూరుకుపోయిన తల్లీకొడుకులను కొద్దిసేపటి వరకూ ఎవ్వరూ గమనించలేదు. ఆలోగా అధిక మొత్తంలో మురుగు నీరు వారి కడుపులోకి చేరిపోయింది. పది నిమిషాల తరువాత స్థానికులు ఈ ప్రమాదాన్ని గమనించారు. వెంటనే తల్లీ కొడుకులను బయటకు తీశారు. ఆ తరువాత బైక్‌ను తాళ్లతో బయటకు తీశారు. కాలువ నుంచి బయటకు తీసే సమయానికి తల్లీ కొడుకులిద్దరూ ప్రాణాలతోనే ఉన్నారు. ఆస్పత్రికి వెళ్తున్నామని స్థానికులకు చెప్పారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు 108 సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. సమీపంలోని పవర వద్ద ఉన్న ట్రినిటీ ఆస్పత్రికి బాధితులను తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తల్లీ కొడుకులిద్దరూ మృతి చెందారు. దుర్గా గణపతి తాపీ పని చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. అతడికి ఇంకా వివాహం కాలేదు. ఊహించని రీతిలో జరిగిన ఈ ప్రమాదంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ సంఘటనతో చిత్రాడ గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సర్పవరం ఎస్సై శ్రీనివాసరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద స్థలం వద్ద అందుబాటులో ఉన్న సీసీ టీవీల ఫుటేజీని సేకరిస్తున్నామని, మృతదేహాలను మంగళవారం జీజీహెచ్‌కు తరలించి, పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని చెప్పారు.

సంఘటన స్థలంలోని డ్రైనేజీ వద్ద ప్రమాదానికి గురైన బైక్‌

మురుగు కాలువలో కూరుకుపోయిన బైక్‌

Advertisement
 
Advertisement
Advertisement