పీజీఆర్‌ఎస్‌కు 437 అర్జీలు | - | Sakshi
Sakshi News home page

పీజీఆర్‌ఎస్‌కు 437 అర్జీలు

Apr 14 2026 7:46 AM | Updated on Apr 14 2026 7:46 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు 437 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌, వివిధ శాఖల అధికారులు అర్జీలు స్వీకరించారు. వీటిని గడువులోగా పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.

పనులు వేగవంతం చేయాలి

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా చేపట్టిన వివిధ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిర ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. ఆయా పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో కలెక్టరేట్‌లో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా చేపట్టిన సీసీ డ్రైన్లు, సీసీ రోడ్లు, కాలువలు, చెరువులు, నీటికుంటలు, తాగునీటి పనులు, భవన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2026–27 ఏప్రిల్‌లో 11.40 లక్షల పని దినాలు లక్ష్యంగా నిర్దేశించామన్నారు. జలజీవన్‌ మిషన్‌ కింద 1,007 పనులను రూ.49,859.42 లక్షల అంచనాతో చేపట్టగా ఇప్పటి వరకూ 581 పూర్తయ్యయన్నారు. 426 పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఇంటింటికీ కుళాయి అందించాలని, ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా గడువులోగా వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా ప్రధాన మంత్రి గ్రామ సడక్‌ యోజన, నాబార్డ్‌, ఇతర కార్యక్రమాల కింద చేపట్టిన రోడ్లు, హెల్త్‌ క్లినిక్‌ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ అన్నారు.

చేనేత సమస్యలు

వెంటనే పరిష్కరించాలి

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): చేనేత కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆలిండియా వీవర్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు పప్పు దుర్గా రమేష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఏపీ చేనేత సహకార సంఘాల జేఏసీ, ఆలిండియా వీవర్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యాన కలెక్టరేట్‌ ఎదుట సోమవారం నిర్వహించిన చేనేతల ఆత్మగౌరవ దీక్షలో ఆయన మాట్లాడారు. చేనేత రంగం తీవ్ర సంక్షోభంలో ఉన్నందున జీవనోపాధిని కాపాడుకోవడమే ఈ దీక్ష ప్రధాన లక్ష్యమని అన్నారు. చేనేత సహకార సంఘాలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని, సంఘాల వద్ద పేరుకుపోయిన నిల్వలను ఆప్కో పూర్తిగా కొనుగోలు చేయాలని, సహకార సంఘాలకు నిరంతర పని కల్పించాలని, రాష్ట్ర బడ్జెట్‌లో చేనేత రంగానికి జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్ది కనీసం రూ.1,000 కోట్లు కేటాయించాలని, చేనేతలపై విధించిన జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని, ముఖ్యమంత్రి ఎన్నికల హామీగా ప్రకటించిన నేతన్న భరోసా కింద రూ.25 వేల ఆర్థిక సహాయాన్ని తక్షణమే విడుదల చేయాలని, చేనేత సహకార సంఘాలకు ఆప్కో, ప్రభుత్వ సంస్థలు చెల్లించాల్సిన రూ.2,003 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని, చేనేత, జౌళి శాఖలో అక్రమాల నేపథ్యంలో కమిషనర్‌ రేఖారాణిని వెంటనే సస్పెండ్‌ చేయాలని దుర్గా రమేష్‌ డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement