● కత్తులతో దాడులు ● ఒకరి మృతి
● నలుగురికి తీవ్ర గాయాలు
● ముకులూరులో ఘటన
రౌతులపూడి: సబ్‌ప్లాన్ ఏజెన్సీ ప్రాంతం రాఘవపట్నం శివారు ముకులూరులో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. ముకులూరుకు చెందిన జర్తా గంగరాజుకు అదే గ్రామంలో జీడిమామిడి తోట ఉంది. ఆ తోటలోని జీడిగింజలను అతడి కుమారుడు దొంగిలించాడు. అయితే, సరిహద్దు తోటల రైతులైన గోము రమణ, జర్తా ఎర్రబ్బాయి, ముర్ల చినబ్బాయి తదితరులే తన తోటలోని జీడిగింజలను దొంగిలించి ఉంటారని గంగరాజు అనుమానపడ్డాడు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం పూటుగా మద్యం తాగి వారి ఇళ్లకు వెళ్లి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో గోము రమణ, అతడి భార్య కోటమ్మ, వియ్యంకుడు జర్తా ఎర్రబ్బాయి, ముర్ల చినబ్బాయి తీవ్రంగా గాయపడ్డారు. మద్యం మత్తులో ఉన్మాదిగా మారిన గంగరాజు.. గ్రామంలో అడ్డు వచ్చిన వారందరిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రమణ, ఎర్రబ్బాయి, చినబ్బాయిలు అతడిని ప్రతిఘటించి, తిరిగి కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన గంగరాజు విపరీతంగా రక్తస్రావమై, అక్కడికక్కడే మృతి చెందాడు. క్షతగాత్రులను తొలుత రౌతులపూడి సీహెచ్‌సీకి తరలించి, ప్రథమ చికిత్స అందించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి 108లో తరలించారు. రౌతులపూడి ఎస్సై వెంకటేశ్వరరావు తన సిబ్బందితో కలసి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తామని చెప్పారు.


