ఈఓగా చక్రధరరావు
ద్వారకా తిరుమల ఇన్‌చార్జిగా
త్రినాథరావు బదిలీ
అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఇన్‌చార్జి ఈఓగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి దేవస్థానం ఈఓ ఎన్‌ఎస్ చక్రధరరావు పూర్తి అదనపు బాధ్యతలతో నియమితులయ్యారు. ఈ మేరకు దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.హరి జవహర్‌లాల్ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. దేవదాయ శాఖ రాజమహేంద్రవరం రీజినల్ జాయింట్ కమిషనర్ (ఆర్‌జేసీ) వి.త్రినాథరావు నాలుగు నెలలుగా అన్నవరం దేవస్థానం ఇన్‌చార్జి ఈఓగా పని చేస్తున్న విషయం తెలిసిందే. ఆయనను ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల దేవస్థానం ఇన్‌చార్జి ఈఓగా నియమించారు.
ప్రస్తుతం ఇన్‌చార్జి ఈఓగా నియమితులైన చక్రధరరావు గత కార్తిక మాసంలో సత్యదేవుని తెప్పోత్సవం, గిరి ప్రదక్షిణ తదితర కార్యక్రమాలకు నియమించిన ప్రత్యేక అధికారుల్లో ఒకరిగా ఇక్కడ సేవలందించారు. తూర్పు రాజగోపురం ఎదురుగా రావి చెట్టు మొదట్లో వెలిగించే దీపాల సెగ వలన చెట్టుకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందనే వార్తలు వచ్చినపుడు దీనికి ఆయనే పరిష్కారం సూచించారు. వాడపల్లి దేవస్థానంలో మాదిరిగా ఇక్కడ కూడా చెట్టుకు దూరంగా ఇనుప ర్యాక్‌లపై దీపాలు వెలిగించాలని పేర్కొన్నారు. ఆ మేరకు అక్కడి నుంచి ర్యాక్‌లు తీసుకువచ్చారు. కార్తికం తరువాత అన్నవరం దేవస్థానం అధికారులు సొంతంగా ఇనుప ర్యాక్‌లు తయారు చేయించి చెట్టు చుట్టూ ఏర్పాటు చేశారు. దీంతో రావి చెట్టుకు దీపాల సెగ తప్పింది. చక్రధరరావు బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నారు.


